మాజీ మంత్రి నారా లోకేశ్‌ను ఓ తెలుగు తమ్ముడు కూరలో కరివేపాకులా తీసిపారేశాడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీలో కీలక వ్యక్తి అయిన చినబాబును పట్టించుకోకుండా పోపో అన్నట్లుగా ప్రవర్తించాడు. తను చెప్పిన వ్యక్తికి టికెట్ ఇవ్వనప్పుడు లోకేశ్ అయితే ఎవడికి గొప్పంటూ లెక్కలోకి కూడా తీసుకోలేదు.
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద మంగళవారం జయహో బీసీ సభ జరిగింది. దీనికి లోకేశ్ విచ్చేశారు. వేదికపై ఉన్న నాయకులతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షుడు బీద రవిచంద్ర.. లోకేశ్‌ను పట్టించుకోకుండా ముఖం పక్కకు తిప్పేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా, టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. చినబాబుతో సన్నిహితంగా ఉండే రవిచంద్ర ఇలా చేయడం వెనుక బలమైన కారణలున్నాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రవిచంద్ర చక్రం తిప్పారు. అలాంటి వ్యక్తి కొంత కాలం నుంచి సైలెంట్‌గా ఉన్నారు. పార్టీలో తన మాట నెగ్గడం లేదని, ఎవరూ లెక్క చేయడం లేదని కుమలిపోతున్నారు. సొంత నియోజకవర్గమైన కావలి టికెట్‌ను తొలుత మాలేపాటి సుబ్బానాయుడికి ఇప్పించాలని రవిచంద్ర తీవ్రంగా ప్రయత్నించారు. కొంత కాలం క్రితం అతడి చేత బాగా ఖర్చు పెట్టించి అధిష్టానానికి చెప్పి ఇన్చార్జి పదవి వచ్చేలా చేశారు. అయితే చంద్రబాబు, లోకేశ్‌లు తాజాగా ఆ సీటును కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. దీంతో రవిచంద్ర అలకపాన్పు ఎక్కారు. డబ్బు మూటలకు టికెట్ ఇచ్చేశారని ఆయన మనుషులు చెబుతున్నారు. రవిచంద్ర పైకి పార్టీలో మామూలుగానే కనిపిస్తున్నా.. తన మనిషికి టికెట్ ఇప్పించుకోలేకపోయానని సన్నిహితుల వద్ద బాధపడ్డారు.
జిల్లా అధ్యక్షుడిగా పార్టీని శాసించిన రవిచంద్రను తండ్రీకొడుకులు వాడుకుని వదిలేశారని ప్రచారం ఉంది. అందుకే ప్రాధాన్యం తగ్గించారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నా అతని ఎదుగుదల అంతంతమాత్రమే. బీసీలకు అండగా ఉన్నామని చెప్పే చంద్రబాబు టికెట్ ఇచ్చిన పాపాన పోలేదు. నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, సర్వేపల్లి ఇలా ఎన్నో చోట్ల పోటీకి నిలబెట్టే అవకాశం ఉన్నా రవిచంద్రకు అవకాశం ఇవ్వలేదు. ఆయన టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన సందర్భాలున్నాయి.
ప్రస్తుతం నెల్లూరు సిటీలో నారాయణ, రూరల్‌లో శ్రీధర్‌రెడ్డి, ఉదయగిరిలో సురేష్ పెత్తనం సాగుతోంది. కావలిలో రాజకీయాలు చేసే అవకాశాన్ని కావ్య కృష్ణారెడ్డి ఇవ్వడం లేదు. చాలా మంది సీనియర్, చోటా నేతలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పార్టీలో రవిచంద్ర కీర్తి మసకబారిపోయింది. కార్యక్రమాలకు పిలిచే వారు కూడా తక్కువైపోయారు. లోకేశ్‌ను నమ్ముకుని ఇలా అయిపోయానని ఆయన బాధపడుతున్నారు. అందుకే బీసీ సభలో అధినేత తనయుడికి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అబ్బే.. అలాంటిదేమీ లేదని సమర్థించుకున్నా.. జిల్లాలో రవిచంద్ర పరిస్థితి చూస్తే ఒకప్పుడు ఎలా బతికినోడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడని అనిపించక మానదు.