‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది రౌడీ సంస్కృతి’ విశాఖపట్నం జిల్లాలో సోమవారం జరిగిన శంఖారావం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలివి. వాస్తవానికి ఆ తండ్రీకొడుకులే అనేక సందర్భాల్లో వీధి రౌడీల్లా ప్రవర్తించారు. గతం, ప్రస్తుతం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వారిద్దరూ పార్టీలోనూ రౌడీమూకల్ని ప్రోత్సహించారు. తమకు గిట్టని వారిపై దాడులు చేయించారు. అధికారులు, పోలీసులను బెదిరించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయినట్లుగా నటిస్తూ లోకేశ్ వైఎస్సార్సీపీని అంటున్నారు. గతంలోకి వెళ్తే అబ్బాకొడుకుల అరాచక పనులు చాలా ఉన్నాయి.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓసారి కాకినాడలో పర్యటించారు. అప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. ఒక విధంగా బెదిరించారు కూడా. కాగా అభివృద్ధి సంబంధిత విషయాలపై కాకినాడలో ప్రశ్నించిన బీజేపీ మహిళా నాయకురాళ్లను ‘సమస్యలు సృష్టించాలని చూస్తే ఫినిష్ అయిపోతారు’ అంటూ బాబు తీవ్ర స్వరంతో బెదిరించారు. దీంతో సదరు వారు టీడీపీ అధినేత తమను భయభ్రాంతులకు గురి చేశారని, ఆయన నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
ఇక కొంతకాలం క్రితం పుంగనూరులో చంద్రబాబు చేసిన అరాచకం అంతాఇంతా కాదు. రాష్ట్రానికే మాయని మచ్చ తెచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపారు. పర్యటన పేరుతో పక్కా ప్రణాళికతో వెళ్లి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టారు. అప్పటికే మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న రౌడీ తమ్ముళ్లు బాబు అండ చూసుకుని పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో 50 మందికి పైగా గాయపడ్డారు. రణధీర్ అనే కానిస్టేబుల్ ఎడమ కంటిచూపు కోల్పోయాడు. అయినా నారా వారు పోలీసులదే తప్పని గద్ధించారు. బాధిత పోలీస్‌పై మానవత్వం కూడా చూపలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి అతనికి రూ.50 లక్షల సాయం చేసి కుటుంబానికి నేనున్నానంటూ భరోసా కల్పించారు.
ఇక అసెంబ్లీలో అయితే బాబు విర్రవీగి రౌడీలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ, బీజేపీ సభ్యులను అనేకసార్లు బెదిరించారు. తోలు తీస్తానన్నారు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు బాబు అండ చూసుకుని రాయలేని భాషలో బూతులు తిట్టారు. చంపేస్తామని భయపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా వారు తీరు మార్పుకోలేదు. సాక్షాత్తు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు వేలెత్తి చూపించి నీ అంతుచూస్తానని బెదిరించారు. కాగితాలు విసిరేసి రచ్చ చేశారు. ఇక తన సభల్లో అయితే టీడీపీ అధినేత పోలీసులను ఇష్టమొచ్చినట్లు తిడుతుంటారు. అధికారంలోకి వచ్చేది నేనే మీ అంతు చూస్తానన్న ఘటనలు అనేకం. ఇందులో ఐపీఎస్ అధికారులు కూడా బాధితులే.
చినబాబేమో ఇలా..
రౌడీయిజం ప్రదర్శించడంలో లోకేశ్ తక్కువేమీ తినలేదు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. పాదయాత్ర, ఎన్నికల సభల్లో ఎర్రబుక్కు చూపిస్తూ.. ఇందులో అధికారుల పేర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల పేర్లు రాసుకున్నానని, తాము పవర్లోకి రాగానే ఒక్కొక్కరిని వెంటాడుతామని చాలాసార్లు బెదిరించారు.
ఓసారి భీమవరంలో యువగళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు టీడీపీ రౌడీమూకలు రెచ్చిపోయాయి. లోకేశ్ అండ చూసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశాయి. అడ్డుకోబోయిన ముగ్గురు పోలీసులను తీవ్రంగా కొట్టారు. దళితులు నివాసం ఉండే ప్రాంతంలో చింతమనేని పర్యవేక్షణలో ఈ దారుణకాండ జరిగింది. ఇంట్లో ఉన్న వారిని వెంటాడి మరీ కొట్టారు. యువగళం టీమ్ డ్రోన్లతో వైఎస్సార్సీపీ వారి గురించి టీడీపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చి మరీ దాడులు చేయించింది. దీనంతటికీ ప్రధాన కారణం లోకేశ్. ఇంకా యాత్ర జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఇళ్లపై వైఎస్సార్సీపీ జెండాలు కనిపిస్తే చినబాబు విడిచిపెట్టే వారు కాదు. తనతో ఉండే అల్లరిమూకల ద్వారా ఆ జనంపై దాడులు చేయించిన సందర్భాలున్నాయి. ఓసారి లోకేశ్ ఏకంగా దళితులకు వేలు చూపిస్తూ గుండు కొట్టిస్తానని బెదిరించారు. జగన్ హయాంలో మాకు మంచి జరిగిందని చెప్పిన వృద్ధులపై బాబు తనయుడు గొడవకు దిగాడు. జులుం ప్రదర్శించాడు.
సొంత పార్టీ నేతలను కూడా లోకేశ్ వదల్లేదు. రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు తెలుగుదేశానికి ఆర్థికంగా ఎంతో సాయం చేశారు. ఆయన్ను తండ్రీకొడుకులు డబ్బు కోసం వేధించారు. తిట్టారు. భయపెట్టారు. దీంతో రంగారావు లోకేశ్ నుంచి ప్రాణహాని ఉందని ప్రకటించారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనను చంపేందుకు కిరాయి గూండాలను మాట్లాడారని తెలిపారు. దీనిపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రీకొడుకులు మొదటి నుంచి రౌడీ సంస్కృతికి అలవాటు పడ్డారు. అల్లరి మూకలను పెంచి పోషించారు. అధికారం లేదని అసహనంతో వాళ్లిద్దరూ ప్రతి సభలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను తీవ్రంగా హెచ్చరిస్తుంటారు. తాము అధికారంలోకి రాగానే మీ సంగతి చూస్తామని, ఒక్కరిని కూడా విడిచిపెట్టమని భయపెడుతుంటారు. పలు జిల్లాల్లో తమ కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులు చేయించారు. అధికారులను భయపెట్టారు. ఇంత చేసి ఇప్పుడు జగన్ పార్టీని అనడం విడ్డూరంగా ఉంది. పైగా విశాఖ సభలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని లోకేశ్ ప్రతిజ్ఞ చేశారు. అచ్చం సినిమాల్లో విలన్లా..