సకల సౌకర్యాలతో కూడి ఇల్లు.. దాని ముందు రూ.కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు.. డజను మందికి పైగా పనివారు.. కోరుకున్న తిండి.. కాళ్లు పట్టేందుకు.. ఒళ్లు పట్టేందుకు మనుషులు.. మద్యం అలవాటు ఉంటే ఇంటి బార్లో వాలిపోయే విదేశీ బ్రాండ్లు.. వెకేషన్ల పేరుతో ఖరీదైన ఫారిన్ ట్రిప్స్.. చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా కార్పొరేట్ ట్రీట్మెంట్.. పనులు చక్కబెట్టేందుకు పీఏలు.. ఇక షూటింగ్ స్పాట్‌కు వెళ్తే ఏసీ వ్యాన్లు.. బయట అడుగుపెడితే ఎండ పడకుండా గొడుగు పట్టే అసిస్టెంట్.. టైమ్‌కు అందే జ్యూస్‌లు.. కళ్లు తిరిగే స్థాయిలో రెమ్యునరేషన్లు.. సమాజంలో పెద్ద మనిషి అనే హోదా.. ఇదీ సినీ నటుడు, మెగా మిడిల్ బ్రదర్ కొణిదెల నాగబాబు జీవితం. ఈయన మాటలు నేర్చిన అతిపెద్ద పెత్తందారు. ఈ హైదరాబాద్ నివాసి చాలా లగ్జరీగా జీవిస్తుంటాడు. అందువల్లే పేదలంటే చులకన. సంక్షేమ పథకాలు అందించేందుకు బటన్లు నొక్కుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హేళనగా మాట్లాడుతున్నాడు.
ఈ మెగా మిడిల్ బ్రదర్‌కు రాజకీయంగా ఆకాంక్షలు ఎక్కువ. చట్టసభల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ ఈ వృద్ధుడి ఆలోచనలు మాత్రం హీనంగా ఉంటాయి. మంగళవారం రాత్రి ఫేస్బుక్లో నాగబాబు ఒక పోస్టు పెట్టారు. దీనిని చూస్తే పేదల విషయంలో ఆయన ఆలోచనలు ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నాయి. జగన్ బటన్ నొక్కడాన్ని చులకన చేశారు. ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే.. సర్వనాశనం కాక తప్పదంటూ వ్యాఖ్యానించారు. జగన్ బటన్ నొక్కుడుతున్నాడంటూ నిత్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏడుస్తూనే ఉన్నారు. వారి సరసన ఈ మిడిల్ బ్రదర్ చేరాడు. ఏనాడైనా పేదల స్థితిగతులు తెలిసుంటే ఈ మాటలు అనరు. నడమంత్రపు సిరి విషలా వీరి శరీరమంతా నిండిపోయింది కాబట్టే నీచమైన మాటలు వస్తున్నాయి.
జగన్ రాజకీయాల్లో దొడ్డిదారిన పైకి వచ్చిన వ్యక్తి కాదు. ప్రత్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయాలు నమోదు చేసిన ధీరుడు. ఓదార్పు, పాదయాత్రల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టనష్టాలు చూశారు. అందుకే తనకు వచ్చిన అవకాశాన్ని పేదల బాగు కోసం వినియోగిస్తున్నారు. అవును నిజమే.. 57 నెలల పాలనలో 125 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. ఆయన బటన్ నొక్కబట్టే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకుని లక్షలాది మంది ప్రాణాలతో బతుకున్నారు. ప్రభుత్వ బడులకు కొత్త రూపు వచ్చింది. పిల్లలు షూ, బెల్టు వేసుకుని బ్యాగ్ తగిలించుకుని ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. బ్రహ్మాండంగా గోరుముద్ద తింటున్నారు. జగన్ నొక్కిన బటన్తోనే లక్షల్లో యువత ఉన్నత చదువుల కలను సాకారం చేసుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, అమ్మఒడి తదితర పథకాలు అంది జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. చిన్నతరహా పరిశ్రమలకు, వృత్తులు చేసుకునే వారికి, ఆటో, ట్యాక్సీలు నడుపుకొనే వారికి, మత్స్యకారులకు, చేనేతలకు, ఇలా అన్ని వర్గాల కోసమే జగన్ బటన్ నొక్కారు. ఇందులో పార్టీలు చూడలేదు. కులమతాలను పట్టించుకోలేదు. పేదల ఆర్థిక స్థితిగతులు మారాలంటే ఎవరో ఒకరు ధైర్యంగా ముందడుగు వేయాలి. జగన్ అదే పని చేశారు. ఎవరికీ వృథాగా డబ్బు ఇవ్వలేదు. ఆయన విన్న లక్షల కన్నీటి కథలే పథకాల వెనుక ఉన్న కారణం. తనకు తాను మేధావిగా చిత్రీకరించుకునే నాగబాబుకు ఇవన్నీ అర్థం కావు.
నాగబాబు, పవన్ కళ్యాణ్‌కు డబ్బే ప్రధానం. అందుకే అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తుంటారు. మిడిల్ బ్రదర్ కొడుకు సినీ హీరోగా ఉన్నాడు. ఒకవేళ తండ్రికి ఎప్పుడైనా మనీ అవసరమైతే ఫోన్లో ఒక్క బటన్ నొక్కుతాడు. లేకపోతే పెద్ద అన్న, తమ్ముడు కూడా బటన్ నొక్కేందుకు రెడీగా ఉంటారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి కొడుకు, కుమార్తెకు డెస్టినేషన్ వివాహాలు చేశారు. అదే పేదింట్లో వివాహమైన వారికి అండగా ఉండేందుకు బటన్ నొక్కి జగన్ షాదీ తోఫా, కళ్యాణమస్తును విడుదల చేశారు. ఇది నాగబాబుకు నచ్చలేదు. బటన్ నొక్కడానికి కావాల్సింది సమర్థత, అనుభవం కాదు.. పేదల పట్ల ప్రేమ, వారికి అండగా ఉండాలనే తెగువ, ఎంత కష్టమైనా సరే పథకాల ద్వారా ఆదుకోవాలనే ధైర్యం. జగన్‌కు గొప్ప మనస్తత్వం ఉంది కాబట్టే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సాయం చేస్తున్నారు. వారిని ఆయన అక్కున చేర్చుకున్నట్లుగా నాగబాబు లాంటి పెత్తందారులు చేయగలరా అంటే.. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదని చెప్పొచ్చు. జనసేన మీటింగ్‌లలో మిడిల్ బ్రదర్, లాస్ట్ బ్రదర్ పార్టీ కార్యకర్తలను విరాళాలు అడుగుతుంటారు. వాళ్లు ఫోన్లలో బటన్లు నొక్కితేనే రూ.కోట్లలో సేన ఖాతాలో డబ్బు వస్తోంది. కార్యాలయం నడుస్తుంది. చంద్రబాబు బటన్ నొక్కితేనే స్పెషల్ ఫ్లైట్లలో తిరగొచ్చు. దీనికి జగన్ బటన్ నొక్కుడికి చాలా తేడా ఉంది. అన్నీ ఒకటి కావు.
ఇదే నాగబాబు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, లోకేశ్‌ను చాలాసార్లు వ్యంగ్యంగా మాట్లాడారు. వీడియోలు చేశారు. బాబును అవినీతిపరుడని కితాబిచ్చారు. మరి ఇప్పుడు నారా వారి చంకనెక్కింది అధికారం కోసమే కదా. బయటికి పేదల కోసమని చెప్పినా పవర్‌ను అనుభవించాలనే కదా లోపల ఉండేది.
బటన్ నొక్కారంటూ హేళన చేసే నాగబాబు ఒకసారి కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చూడొచ్చు. జగన్ వల్లే నిలబడిన ప్రాణం కళ్లు ఎంతో కృతజ్ఞత చూపిస్తాయి. బడికి వెళ్తే పేదింటి బిడ్డలో ప్రపంచాన్ని జయించేస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ప్రభుత్వ సాయంతో చిన్నపాటి వ్యాపారం చేసుకునే మహిళతో మాట్లాడితే ఆమె జీవితం ఎలా మారిందో వివరిస్తుంది. సినిమా సీన్ కంటే ఎక్కువ గూస్బంప్స్ వస్తాయి.
పేదల కోసం బటన్లు నొక్కుతుంటే ఏడుస్తున్న నాగబాబుకు అసలు కొణిదెల శివశంకర వరప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారో తెలియంది కాదు. కోట్ల మంది కార్మికులు, చిరుద్యోగులు రెక్కల కష్టం చేసి డబ్బు సంపాందించి సినిమా టికెట్ కొంటే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆ పేరు చెప్పుకొని మిడిల్ బ్రదర్, పవన్ సినిమా రంగంలోకి వచ్చారు. ఈ ఇద్దరి ఎదుగుదలకు కూడా ఆ పేదలే కారణమని మర్చిపోయి వారు అందుకున్న పథకాలను హేళన చేసి మాట్లాడుతున్నారు. చిరంజీవి కాకపోయి ఉంటే నాగబాబు కూడా ఏదో ఒక ప్రభుత్వ పథకం కోసం ప్రయత్నించేవాడే..
చివరగా.. నాడు ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి ఒక్క అవకాశం అడిగిన వ్యక్తే.. ఈ విషయాన్ని నాగబాబు మర్చిపోయినట్లున్నారు. జగన్ పాలనకు కొత్తే.. సలహాలు ఇస్తే తీసుకోనని ఏనాడైనా చెప్పాడా.. ఎక్కడైనా తప్పులుంటే ప్రశ్నించవద్దని ఎవరినైనా గద్దించాడా. ఫలానా వారికి సాయం చేయండి అంటే బటన్ నొక్కను అన్నాడా.. రాజకీయాల్లో అత్యంత హుందాగా ఉండే వ్యక్తి ఆయన. సరే ఇప్పుడు నాగబాబు, పవన్ ఎలాగైనా చట్టసభల్లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు కదా.. ఇది సాధ్యమవ్వాలంటే పేదలే కదా ఈవీఎంలలో బటన్లు నొక్కాలి. వారు తమకు జగన్ మంచి చేశాడని ఫ్యాన్ గుర్తుపై నొక్కితే ఈ మెగా మిడిల్ బ్రదర్, లాస్ట్ బ్రదర్ చిరునామా మళ్లీ హైదరాబాద్‌కు మారిపోతుంది.