మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 20 సెకన్ల వీడియో ఎన్నికల సంఘం నుండి బయటికి వచ్చింది కాదని ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ వీడియోని పోస్ట్ చేసిన లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు అర్ధమౌతుంది. పాల్వాయి గేట్ బూత్ లో టీడీపీ చేసిన రిగ్గింగుని అడ్డుకున్న పిన్నెల్లిని టార్గెట్ చేస్తూ టీడీపీ ఆడిన డ్రామా తిరిగి వారి మెడకే చుట్టుకోబోతుందని ముఖేష్‌కుమార్ మీనా ప్రకటనతో స్పష్టం అవుతుంది.
ఎన్నికల అనంతరం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా పాయింట్ లో మాట్లాడుతూ మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాలో, కోడూరులో 2 ఈవీఎంలు ధ్వంసం అయినట్టు ప్రకటించారు. అయితే మిగిలిన 9 ఈవీఎంలను పగలకొట్టిన వీడియోలు బయటికి రాలేదు కానీ పాల్వాయి గేటు వీడియోలోని కొంత భాగం వరకే టీడీపీ వారికి చేరడం వెనుక పెద్ద కుట్రనే ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కుట్రలో లోకేష్ పాత్రపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అధికారుల్లో ఎవరికైనా లంచం ఇచ్చి ఆ వీడియోని తెప్పించుకున్నారా లేక మరో మార్గంలో ఏమైనా ఆ వీడియో వారి చేతికి చేరిందా అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా తొందరపడి ఆ వీడియోని విడుదల చేశారని చివరికి ఇది లోకేష్ మెడకే చుట్టుకోబోతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.