కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న తన కుమారుడితో కలిసి తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కిర్లంపూడి నుంచి ర్యాలీగా బయల్దేరి తాడేపల్లి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనతో పాటు మద్దతుదారులంతా తనతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన లేఖలో ఏం పేర్కొన్నారంటే..
గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికి మీడియా ద్వారా తెలుసు అని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పధకాలతోపాటు, వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా. 14-03-2024న వైఎస్సార్సీపీలో చేరుటకు ఉదయం 8-00 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్ధిస్తున్నానండి’ అంటూ ముద్రగడ బహిరంగ లేఖ రాశారు.
కాగా కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలతో విభేదించిన ముద్రగడ ఇటీవల తన సొంత నిర్ణయాలను తాను కూడా తీసుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడని తన బహిరంగ లేఖలో విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ముద్రగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనుండడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.