టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కాగా ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పుకొచ్చిన నాని అంత వరకూ కూడా ఆగలేదు. రాబోయే ఎన్నికల్లో తనకు టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పాటు లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తుంది.
కేశినేని నాని ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ గారిని కలసి నా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని వెల్లడించారు.
గత రెండు రోజుల క్రితమే టీడీపీ కేడర్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగడంతో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో ఇరువర్గాలు చేతికందిన వస్తువులతో బాహాబాహీకి దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసినా వెనక్కి తగ్గని విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల్లో చంద్రబాబును వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడినని కానీ నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని, తినబోతూ రుచులెందుకని మీడియాతో హాట్ కామెంట్స్ చేశారు నాని.
కాగా కేశినేని చిన్నికి చంద్రబాబు టికెట్ ఇస్తారన్న ఊహాగానాలున్న నేపథ్యంలో కేశినేని నాని తన సోదరుడికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక ఇతర పార్టీల నుండి పోటీ చేస్తారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏది ఏమైనా టీడీపీ తీసుకున్న నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో హీట్ పెంచిందని చెప్పొచ్చు.