రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వేరే వ్యక్తిని ఎంచుకున్నామని కాబట్టి ఇకపై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేశినేని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని చెప్పుకొచ్చిన కేశినేని నాని తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.
కేశినేనిభవన్కు చేరుకున్న ఎంపీ నాని మీడియాతో మాట్లాడుతూ నన్ను తిరువూరు సభకు రావొద్దని చెప్పారని నేను వెళ్తే మళ్లీ గొడవలు మొదలవుతాయని పేర్కొన్నారు. నేను టీడీపీలో కొనసాగాలో వద్దో నా అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారని, తినబోతూ లెందుకు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబును వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడినని కానీ నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని వ్యాఖ్యానించారు. తాను పోటీ చేస్తే ఇండిపెండెంట్‌గా అయినా గెలుస్తానని, ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.
కేశినేని నాని తాజా కామెంట్స్ తో విజయవాడ టీడీపీ రాజకీయం రాజుకున్నట్లే కనిపిస్తుంది. కొంతకాలం క్రితం నుండి ఎంపీ కేశినేని నానికి టికెట్ ఉండదని ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వడం లేదని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో కేశినేని నాని తిరుగుబాటు బావుటా ఎగరేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేశినేని నాని తీసుకునే నిర్ణయం కోసం ఆయన అనుచరులు వేచి చూస్తున్నారు. కాగా ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని నాని ప్రకటించిన నేపథ్యంలో ఆయన కామెంట్స్ టీడీపీతో పాటు ఆయన అనుచరవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.