కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల కడప జిల్లాలో వైఎస్ వివేకా కుమార్తె సునీతను వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యలో నిందితుడైన అవినాష్‌కు టికెట్ ఎలా ఇస్తారంటూ విమర్శిస్తున్న షర్మిల, వైఎస్ అవినాష్‌ను ఓడించేందుకు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మీద సంచలన ఆరోపణలు చేస్తున్న షర్మిలకు వైఎస్ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మనిషిగా పుట్టాక కనీసం విచక్షణా జ్ఞానం ఉండాలని, విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అవినాష్ రెడ్డి వెల్లడించారు.. బురదచల్లి తుడుచుకోమని చెప్పడం మామూలైపోయిందన్న అవినాష్ రెడ్డి ఎన్నైనా అనండి, ఎంతైనా ప్రచారం చేసుకోండి అని స్పష్టం చేశారు. తుడుచుకుంటూ పొతే, బురదచల్లుతూనే ఉంటారని మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. మాట్లాడే వాళ్లది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుందంటూ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కడప ఎంపీ సీటు కోసం వైఎస్ కుటుంబం నుంచి అక్కా తమ్ముళ్లు పోటీపడుతుండటంతో ఇప్పుడీ స్థానం గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన తమ్ముడైన అవినాష్ పై పోటీకి దిగుతుండడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్న ధీమాతో అవినాష్ రెడ్డి ఉన్నారు.