తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు . పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యంగా నేటి నుండి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుంది. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నాం. వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాము. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాము. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలి. ఆరోగ్య శ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని సీఎం జగన్ వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినితో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
నూతనంగా పంపిణీ చేయనున్న ఆరోగ్యశ్రీ స్మార్టు కార్డుల్లో క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరిచారు.క్యూఆర్ కోడ్‌తో లాగిన్ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు కల్పించారు. ఆరోగ్యశ్రీ స్మార్టు కార్డు స్కాన్ చేయడం ద్వారా గతంలో చికిత్స చేయించుకున్న రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తద్వారా మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు వీలవుతుంది.