2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల చేతికి చిక్కుతున్న ఒక్క మంచి చారిత్రిక అవకాశం .. తెలుగు నేలన్నా, తెలుగు ప్రజలన్నా తెలుగు దేశం అనే రాజకీయపార్టీ దోపిడీకి ఎన్నోరకాల సంపదనిచ్చే గొప్ప నిధి. స్వాతంత్య్రం పొంది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, తుంగభద్ర రిజర్వాయర్లను నిర్మించుకొని .. దేశానికి అన్నపూర్ణగా మారింది ఆంద్ర ప్రదేశ్, ప్రభుత్వ ఆధ్వర్యములో అప్పటి పాలసీలకు అనుగుణంగా విద్యుత్ ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు , విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పింది. అలాంటి ప్రగతిబాటలో నడుస్తున్న రాష్ట్రములోకి రాజకీయ, సామాజిక కారణాలతో .. సినిమా గ్లామర్‌తో నాలుగు దశాబ్దాల క్రితం ఒక రాజకీయ పార్టీ ప్రస్థానం మొదలయ్యింది.
వాళ్ళ అధికారం కోసం రాష్ట్ర పురోగతి దారితప్పే విధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సంక్షేమం అజెండా అయ్యింది. అక్కడ నిజంగా పేదల సంక్షేమం కోరే వారైతే పేదలను పేదరికం నుండి తొలగించే అసలైన సాధనాలైన విద్యమీద, వైద్యం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు, విద్యా సంస్కరణలు అమలు చేసేవారు, కానీ అలా చెయ్యలేదు. వీరి హయాములో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి , వీళ్ళు వనరుల దోపిడీకి తెర తీశారు. అప్పట్లో రెవిన్యూ వ్యవస్థలో సంస్కరణలు అని చెప్పి చాలా భూములను ముఖ్యంగా దేవుడి మాన్యాలను కాజేశారని చెబుతుంటారు. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో గత ప్రభుత్వాల మాదిరి ఎక్కువ పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ఆలోచన వారికి తట్టలేదు. దాని ఫలితం విద్యుత్ కోతలు, వర్షాలు పడకుంటే కొన్ని ప్రాంతాల్లో కరవులు వచ్చి ఆత్మ హత్యలు సాధారణం అయ్యింది. నక్సలైట్ల బలమైన ఉద్యమానికి గట్టి పునాదులు పడ్డాయి.
సంపూర్ణ మధ్య నిషేధం రెండు రూపాయల బియ్యాన్నీ ఆయుధాలుగా మళ్ళీ రెండో సారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది అదే పార్టీ. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీని ప్రజలు కట్టబెడితే పట్టుమని ఆరు నెలలు కూడా కాకుండానే అధికారమే కీలక కారణంగా ప్రజల తీర్పును, ప్రజల ఆకాంక్షలను పూచిక పుల్లలుగాచూసి సంక్షోభాన్ని ప్రజలకు ఇచ్చి కుట్రలతో, వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బాబు అధికారం చేజిక్కించుకున్న నాటికి ఆర్ధిక సంస్కరణలు అమలు లో ఉన్నాయ్. వాటి ఆలంబనగా ఇక తనకు మాత్రమే సొంతమైన దోపిడీ ఆలోచనల్లో వేగం, వాటి అమలులో కొత్తపద్ధతులు వచ్చి చేరాయి. అలాంటి అజెండాతోనే ప్రజల రక్త స్వేదాలతో నెలకొల్పుకున్న ఎన్నో ప్రభుత్వ రంగ స్థలాలు, విలువైన ప్రభుత్వ భూములు పప్పుబెల్లాలకు తన అస్మదీయుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. కరెంటు కోతలు, కరవులు, నక్సలైట్ ఉద్యమం తీవ్రమైన సమస్యలుగా ప్రజలను పట్టి పీడిస్తుంటే .. తాను మాత్రం తన అధికార కేంద్రం హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి మాటున దోపిడీ ప్రణాళికల్లో మునిగి పోయారు, మిగిలిన రాష్ట్రప్రజల సమస్యలను గాలికి వదిలివేశారు, దాని ఫలితం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు. అవన్నీ కూడా ఒక విధంగా దోపిడీ ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన హత్యలే. హైద్రాబాద్‌లో దోపిడీ ఎలా జరిగిందో, ఒక వర్గం వారు అక్కడి వనరులను ఎన్ని రకాలుగా దోచుకున్నారో ఒక విదేశీ విద్యార్ధిని పరిశోధన చేసి మరీ వివరంగా చెప్పింది. ఇదంతా కాసుకు ఒక పక్కనున్నదైతే , మరొక పక్క అప్పటి ముఖ్యమంత్రిని ఒక ప్రగతి కామకుడిగా, ఆధునిక ఆర్థిక వేత్తగా, తాను చేసినంత గొప్పగా ఎవ్వరూ చెయ్యలేరని ప్రజల్లో భ్రమలు కల్పించటంలో 4th ఎస్టేట్ గా చెప్పుకోబడే మీడియా విజయవంతమైంది. ఈ పేరుగొప్ప 4th ఎస్టేట్ ఎవరు అని ఆలోచించక్కర్లా … తమ దోపిడీలకు సహకరిస్తూ, తమ దోపిడీలో భాగమై ఆ దోపిడీకి మేలి ముసుగులద్దుతూ దోపిడీకి రాజబాటను ఏర్పాటు చేసే ప్రధాన పనిమంతురాలే ఆ 4th ఎస్టేట్. వీళ్ళందరూ అక్కడితో ఆగిపోలా…! ఆ దోపిడీ అలా నిర్ద్వందంగా, ఇంకా బలంగా నిరంతరాయంగా సాగిపోవాలంటే ఇంకొక ప్రధాన ఎస్టేట్ తమలో భాగం కావాలని దాన్నికూడా తమకు కావాల్సిన స్థాయిలో వశపరచుకున్నారు.
అలా వాళ్ళే చీకటగదుల్లో ఏవో దోపిడీకి ప్రణాళికలు వేసుకుంటారు, బయటకు మాత్రం దానికి అభివృద్ధి , సంస్కరణలు అనే మేలి ముసుగును ఆ 4th ఎస్టేట్ రచించి అమలు చేస్తుంది, దీన్ని దాటుకొని వారి దోపిడీని అడ్డుకోవాలని ఎవరైనా ఇంకో ఎస్టేట్ ను ఆశ్రయిస్తే .. ఆ ఎస్టేటులోనున్న తమ మనషులచేత అంతా సవ్యమనో, లేదా స్టేటస్ కో అనో ఉత్తుర్వులు వచ్చి పడేవి. అలా కొందరు వీళ్ళ దోపిడీ శృతి మించి రాగాన పడుతోందని నమ్మితే ఇంకొందరూ వీళ్ళు నిజంగానే లోక కళ్యాణం కోసం ఇదంతా చేస్తున్నారని నమ్మేవారు, కానీ నిజంగా ప్రజోద్దారకులైతే వీళ్లేందుకు తటస్థంగా, ఉన్నతంగా రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజా ప్రయోజనాలకు పాటుపడాల్సిన వ్యవస్థలను తమ గుప్పిట పెట్టుకొని ఒక మహా మాఫియాగా మారి ఆటాడుతున్నారో అని ఆలోచించలేక పోయారు.
ఇలా దోపిడీ ప్రణాళిక, దోపిడీ అమలు, దాని ముగింపు, దానికి విరుద్ధంగా అంతా ప్రజల బాగుకోసమే అనే విధంగా ప్రజల్లో భావ వ్యాప్తి…., అంతా వాళ్ల చేతుల్లోకి పోయింది, ఇదొక వికృతమైన, ప్రజాకంఠక ముఠాగా మారి ఒక మహా మాఫియాగా మారిపోయింది. దాని ఫలితమే .. రాష్ట్ర విభజన.., ఆ విభజన అనంతరం కూడా కీలకమైన రాజధాని స్థల నిర్ణయం, అమలు దాని వెనకున్న దోపిడీ. ఇక్కడా మూడు వ్యవస్థల్లోని దుష్ట శక్తులు అవే చేతులు కలిపాయి, ప్రజలకు విశ్వనగరం అనే రంగుల కలలు చూపి దానివెనుక ప్రపంచ చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధానినే తమ ప్రైవేట్ ఎస్టేట్ గా మార్చుకొనే మిషన్ కి తెరలేపారు. అక్కడ రాజధాని ఆ మాఫియా ప్రణాళికల ప్రకారం అమలైతే వారికి అదొక అంతులేని సంపాదనను, సంపదను అందించే అక్షయ పాత్ర అయ్యుండేది. అదే జరిగితే ప్రజలు ఎదుర్కోవాల్సిన విపరిణామాలు ఊహకందనివి. కానీ ప్రజలు అప్రమత్తమవ్వటం, అధికారం మారటం వచ్చిన కొత్త ప్రభుత్వం అక్కడ జరిగిన భారీ అక్రమ భూ భాగోతాలను తవ్వే ప్రయత్నం చెయ్యటంతో .. వ్యవస్థల్లోని తమ దోపిడీ మాఫియా సభ్యులు చెలరేగటంతో ప్రస్తుతానికి ఆ అంశం అలా స్టేటస్ కో లో పడింది. పైగా విచిత్రంగా ఆ అక్రమాల వెనుక జరిగిన భాగోతాలను, ఆ అక్రమార్కుల గురుంచి బహిరంగంగా మాట్లాడొద్దని కూడా ఉత్తుర్వులు తెచ్చుకోగలిగారు. ప్రజలు ఆగ్రహం చెంది ముక్కుపై వేలు వేసుకోగలిల్గారు కానీ వారికి బుద్ధి చెప్పటానికి అవకాశం లేకుండా పోయింది.
మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావటంతో తాము ప్రజలను నమ్మించే సానుకూల మార్గాలు పెద్దగా లేక నెగటివ్ ప్రచారాన్ని బలంగా, ఇంకా బరితెగించి తీవ్రంగా చెయ్యటం మొదలు పెట్టారు. దానికి ప్రధాన ఆయుధంగా 4th ఎస్టేట్ ముందుండి నడుపుతోంది. అందులో భాగమే ల్యాండ్ టైటిల్ ఆక్ట్, ప్రజా ఆస్తులను దోచుకొనే ఆయుధం అని ప్రజల మనసుల్లో విషాన్ని నింపే పనికి ఒడికట్టింది. ఇక్కడ కొసమెరుపేమిటంటే గత నాలుగు దశాబ్దాలుగా ప్రజా వనరులను, భూములను దోచుకున్న ముఠాయే ఇప్పుడు ప్రజలకోసం ముసలి కన్నీరు కార్చటం. దీనికి గల బలమైన అసలు కారణాన్ని కూడా చెప్పుకుందాం.
నిజానికి ల్యాండ్ టైటిల్ ఆక్ట్ అనేది ప్రజలకు దక్కబోతున్న వరం. అందులో కొన్ని చిన్న చిన్న లోపాలుంటే, దానిని అమలు పరిచేటప్పుడు బయటకొచ్చే ఏవైనా ఊహించని సమస్యలుంటే సరిచేసుకోవడం పెద్ద పనికాదు. ఈ రోజు మన కోర్టుల్లో ఆస్తులు, వాటి లావాదేవీలపై ఉన్న వివాదాలే సింహభాగం. చాలా మంది బాధితులు ఫలితం చూడకుండానే కన్ను మూసే పరిస్థితులు, చాలామంది ఈ వివాదాలవల్ల తమ విలువైన కాలాన్ని, జీవితాలను, సంపదను కోల్పోతున్నారు. వీటన్నిటికీ ముగింపు పలికేదే ల్యాండ్ టైటిల్ ఆక్ట్. ఇది ఏ వివాదాలు లేని భూములకు అనగా మొత్తం భూముల్లో 85 -90 % భూములకు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో సరిహద్దులను కొలిచి, నిర్ణయించి వాటిని తమ భూ పత్రాలలో పొందు పరచి భూయజమానులకు ఇవ్వటమే కాక, ఆ భూ పత్రాలకు ప్రభుత్వం హామీగా నిలబడబోతోంది. అంటే మన భూములకు ప్రభుత్వ హామీ, భరోసా ఇచ్చి నిలబడుతుంది. తదుపరి జరిగే అన్ని రకాల భూలావాదేవీలను చాలా సులభతరం చేయబోతోంది. ఇకపైనా ఏ కబ్జాకోరు ఏమీ చెయ్యలేని విధంగా ప్రభుత్వమే రక్షణ కవచంగా నిలవబోతోంది. ఇది పేద, బలహీన ప్రజలకు వరం కాక మరేమిటీ ? మరొక పక్క ఇప్పటికే వివాదాలు, సమస్యలలో ఉన్న ఆస్తులను క్రమబద్ధీకరించేందుకు నిజమైన భూయజమానులు నష్టపోకుండా తగిన చర్యలు చేబడుతోంది. ఇక్కడే కొంత మంది అతి తెలివిని ప్రదర్శిస్తూ ఈ 10 -15 % భూ వివాదాలను పరిష్కరించే క్రమములో తలెత్తే సమస్యలను బూచిగా చూపి మొత్తం 100 % భూములకు ఆ సమస్యలను అంటగడుతూ ప్రజలలో భయాందోళనకు రేకెత్తించే విధంగా అదే దోపిడీ ముఠా కథ నడుపుతోంది. ఇలా ఆ 10 -15 % వివాదాల్లో ఉండే భూములకు ప్రభుత్వ ప్రతిపాదనల కన్నా మేలైన పరిష్కారాలు ఉంటె చెప్పి అంత మంచి చట్టాన్ని అమలు పరిచే విధంగా చేయటమా నిజమైన ప్రతిపక్షాల బాధ్యత. ఏ ప్రజాకాంక్ష ఉన్నవారైనా ఆ పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం దక్కాలని కోరుకుంటారు కానీ విచిత్రంగా పైన చెప్పుకున్న మాఫియా ఈ అంశాన్ని ఎత్తుకుందంటే .., వారి గత దోపిడీ చెరిత్రను ఎరిగిన ప్రజలు ఒకటికి పది సార్లు ఆలోచించాలిసిందే.
న్యాయవాదుల ఆందోళన తమ వృత్తి ఆదాయానికి, జీవనోపాధికి సంబంధించింది కాబట్టి కొంత వరకూ సానుకూలంగా తీసుకోవచ్చు. న్యాయవాదులు వ్యతిరేకంగా ఉన్నారంటే అది వారి జీవనోపాధిని ఎంతగా దెబ్బతీస్తోందో అని మాత్రమే కాదు, ఎన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందో, ప్రజలకు ఎంతగా ఉపశమనం కలుగుతుందో అని కూడా ఆలోచించాలి.
కానీ ఇక్కడ ఆ మహా మాఫియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదంటే, తాము అధికారం చేబడితే దాని అమలు రద్దు చేస్తామని బుసలు కొడుతోందంటే ప్రజలు ఆలోచించాలిసినవి వేరే .. ఆ ఆక్ట్ అమలైతే 4 దశాబ్దాలుగా దోచిన గ్రామ కంఠం, పోరంబోకు, అసైన్డ్ ల్యాండ్స్, ఇంకా ఇతర రకాల దోపిడీ భూముల భాగోతాలు , కలల రాజధాని, సింహాచలం, దుర్గ గుడులకు చెందిన దోపిడీ భూముల లెక్కలు బయట పడతాయనేమో .. తాము తమ దోపిడీ భూములను కోల్పోవటమే కాదు, భూములను దోచినా సరే పెద్దమనుషులుగా, ప్రజాఉద్ధారకులుగా తమను తాము ప్రజల మనుషుల్లో ఇన్ని రోజులూ ఆడిన నాటకమంతా పోయి ప్రజలముందు నగ్నంగా నిలబడి ఆ పోగేసుకున్న దోపిడీ ఆస్తులను, పరువునూ పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉన్నట్లుంది. అందుకే అంతా మంచి ప్రజాపయోగకరమైన యాక్టుపైనా తమ విషాన్ని అంతటి తీవ్ర స్థాయిలో కక్కుతున్నారని బావించవలసివుంది.
అందుకే 2024 ఎన్నికలు అనేవి నాలుగు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఆ మహా మాఫియాను కూకటి వేళ్ళతో పెకలించివేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చిక్కిన మంచి అవకాశం. తమ సంపదను, అవకాశాలను, భవిష్య్తతును దోచిన, దోచుకోవడానికి కాచుకు కూచున్న మహా మాఫీయాను చావు దెబ్బ కొట్టడానికి 2024 ఎన్నికలు ప్రజలకు దక్కిన సదవకాశం, తమ ఓటుతో తమను దోచిన దోపిడీ దారుల ముఠాకు బుద్ధి చెప్పే అవకాశం.