భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చక్రాలు తిప్పుతూనే ఉన్నారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. దీంతో దేశ రాజధానికి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు సీట్ల కోసం కొట్టుకున్నంత పనిచేస్తున్నారు. కానీ ఎవరికీ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. ఓ వైపు ఎల్లో మీడియాలో మాత్రం ఎక్కడెక్కడ పోటీ చేయాలో బాబు, పవన్ నిర్ణయించారని వార్తలు వడ్డిస్తూనే ఉన్నారు. అయితే అధికారిక జాబితాను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల్లో అసహనం ఎక్కువైపోతోంది. బీజేపీ పొత్తుపై స్పష్టత ఇచ్చి.. వారు ఎక్కడ పోటీ చేస్తారో తేలాకే లిస్ట్ బయటకు వస్తుందని ప్రచారం జరుగుతోంది.
గురువారం బాబు, పవన్ మరోసారి సమావేశమై చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత కమలం పెద్దలతో చర్చించేందుకు టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్తారని సమాచారం. ఇప్పటికే ఆయన బీజేపీలోని తమ మనుషులతో అనేక పర్యాయాలు మాట్లాడారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వారిపై ఒత్తిడి పెంచారు. కానీ నరేంద్రమోదీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ఇక లాభం లేదనుకుని చేతులు, గడ్డాలు పట్టుకునైనా సరే ఒప్పించాలని తానే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జనసేనానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. కమలం పెద్దలు బాబుకు అనేక షరతులు పెట్టారని, వాటిని అంగీకరించే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి నారా వారికి బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది.