ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమీషన్విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కూటమి నేతలకు అనుగుణంగా వ్యహరిస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ జారీ చేసే ఆదేశాలు అన్ని ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగానే ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకో పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమీషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది. అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది.
కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమీషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్.. నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు? అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.