ప్రత్యర్ధి పార్టీలపై బురద జల్లడం ఆ పై ఆ బురదను తుడుచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ బుకాయించడమే జనసేనరాజకీయ సిద్ధాంతంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అసత్య ఆరోపణల నుండి విద్యార్ధులకి అందించే టోఫెల్ శిక్షణపై నాదెండ్ల మనోహర్ చేసిన నిరాధారమైన ఆరోపణల వరకు ప్రతీదీ పసలేని ఆరోపణే కావడం గమనార్హం. రాజకీయ పరిపక్వత లేని పిల్లలని తప్పుదారి పట్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చే ఎత్తుగడతోనే జనసేనపార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.
ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలపై ఇన్నిరోజులు పసలేని ఆరోపణలు చేస్తూ వచ్చిన జనసేన ఇప్పుడు అధికారులపై కూడా అదే పంథాలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తునే వచ్చారు. ఉత్తరాంధ్రలో 2000 కోట్ల విలువైన అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి కాజేశారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. ఇప్పటికే తన కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకుపైగా భూములను కాజేశారని అన్నారు. వాటి రిజిస్ట్రేషన్ల కోసం నాలుగు రోజుల క్రితం విశాఖ వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్ష అని చెప్పుకున్నారని పసలేని ఆరోపణలు చేశారు..
జనసేన కార్పొరేటర్ మూర్తి చేసిన ఆరోపణల నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డి సదరు ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి చేసిన అసత్య ఆరోపణలు వాస్తవం కాదని ఖండిస్తూ సీఎస్ పత్రికా ప్రకటన చేయడంతో పాటు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించడం జరిగిందని, త్వరలో లీగల్ నోటీసు జారీ చేయనున్నటు సీఎస్ కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. వెనుకబడిన ఉత్తరాంధ్రను రాజధానిగా చేయాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వెళుతుంటే, అసత్య ఆరోపణల్తో ప్రభుత్వంపై చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేయడం క్షమించే విషయం కాదని పలువురు అధికారులు సైతం స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఇటువంటి వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కున్నేందుకు సిద్దపడాలని వారు హెచ్చరిస్తున్నారు.