ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎన్డీఏ కూటమి ఖరారు అయినప్పటికీ నియోజవర్గ స్థాయిలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. టికెట్ తెచ్చుకున్న అభ్యర్థికి మరో పార్టీ నాయకులు సపోర్ట్ చేసే దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్రస్థాయి నాయకత్వం నియోజకవర్గాలలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇతర పార్టీ నాయకులు రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలో ఇది బయటపడింది.
నందమూరి బాలకృష్ణ తలపెట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్ర మొదట కదిరిలో నిర్వహించి అక్కడ పోటీ చేసే నాయకుడికి ఓటు వేయండి అని అడగకుండానే తను ప్రసంగాన్ని ముగించాడు. ఆ మరుసటి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర సాధికార యాత్ర నిర్వహించగా ఆ సభకి కూటమి ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శబరి హాజరు కాలేదు. బైరెడ్డి శబరికి, నందికొట్కూరు నియోజవర్గ తెలుగుదేశ ఎమ్మెల్యే అభ్యర్థికి పొంతనలేదని సమాచారం. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరికొకరు సహకరించకపోతే ఎన్నికల్లో విజయం ఎలా సాధిస్తారని కూటమి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల తెనాలిలో నాదెండ్ల మనోహర్ కి మద్దతుగా ప్రచారం చేయడానికి తెనాలి వచ్చాడు. ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టాడు. పొత్తు లో భాగంగా సీట్ తనకే వస్తుందని ఆలపాటి రాజా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సీటు నాదెండ్ల మనోహర్ కి దక్కడంతో , ఆ సీటు విజయంపై తనకు ఏమి పట్టనట్లు ఇంటికి పరిమితమయ్యాడు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రచారంలోకి భాగంలో ఆ నియోజకవర్గంలోకి వస్తే తనని కలవకపోవడం తో ఆలపాటి రాజా మనసులో ఏముందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంతుపట్టడం లేదు. రానున్న ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ కి ఆలపాటి రాజా సహకరిస్తాడో లేదో చూడాలి. ఇలా పార్టీలోనే ముఖ్య నాయకులు నియోజవర్గాలు పర్యటిస్తున్న వేళ ఇతర పార్టీ నాయకులు సహకరించకపోవడంతో కూటమి ఎలా నష్టపోతుందో రానున్న ఎన్నికలతో తెలిసిపోతుంది.