‘వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్మిషన్లు అన్ని వచ్చాయి. దీనిని పూర్తి చేయడానికి పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. కేవలం పైప్‌లైన్ వేయడం.. మోటార్ బిగించి పంప్ చేయడమంతే.. పెద్ద పని పర్మిషన్లు తీసుకురావడం.. గతంలో శంకుస్థాపనలు జరిగాయి. అయితే పూర్తి అనుమతులతో చేయలేదు. ప్రస్తుతం అన్ని ఉన్నాయి. అసలు టైగర్ రిజర్వ్ పర్మిషన్ రావడం చాలా కష్టం. దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదు. అది కూడా వచ్చింది. ఇక చిన్నచిన్న పనులున్నాయి. టీడీపీ ప్రభుత్వం వస్తే పది నుంచి 12 నెలల్లోనే వరికపూడిశెలను పూర్తి చేస్తాం’ నరసారావుపేట పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు మాటలివి.
వాస్తవాలు పరిశీలిస్తే.. ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే చంద్రబాబు 1996లో శంకుస్థాపన చేశారు. 1999 నుంచి 2004 వరకు ఆయన కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆరోజు అనుమతుల గురించి పట్టించుకోలేదు. భూమి పూజ చేసి తొమ్మిది సంవత్సరాలపాటు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. పనులు గాలికొదిలేసి పల్నాడు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అనుమతులు రావు.. ఆ ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు చంద్రబాబు. ఆ తర్వాత 2019 పీబ్రవరిలో ఏ అనుమతులు లేకుండానే ఎన్నికల కోసం శంఖుస్థాపన చేసి పల్నాడు ప్రజలకు ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు.
అసాధ్యమనుకున్న వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని అనుమతులు తెచ్చి సాధ్యం చేసి చూపించారు. ఇందులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషి ఎంతో ఉంది. ఆనాడు సీఎం సూచనలతో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న లావు కేవలం సహకారం అందించారంతే. అసలు అనుమతులు తీసుకురాని.. ప్రాజెక్టును కట్టను అన్న చంద్రబాబు పార్టీలో చేరి మళ్ళీ మేం నిర్మిస్తాం అంటే నమ్మే మాటేనా .
14 సంవత్సరాల పాలనలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి గాలికొదిలేసిన చరిత్ర బాబుది. ఉదాహరణకు వెలిగొండను తీసుకుంటే దీనికి టీడీపీ అధినేత శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ హయాంలో పనులు వేగంగా జరిగాయి. ఆయన మరణానంతరం ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బాబు వెలిగొండను అడ్డం పెట్టుకుని సుమారు రూ.600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదిక ఇచ్చింది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే పనులు జరిగి రెండు టన్నెల్స్ పూర్తయ్యాయి. ఇటీవల ప్రారంభోత్సవానికి కూడా నోచుకొంది.
ఇలా చెప్పుకొంటూ ప్రతి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన మోసమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారిన లావు వరికపూడిశెలపై ఇస్తున్న హామీలు నమ్మేలా లేవని పల్నాడు వాసులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనుమతులు రాకుండానే శంకుస్థాపన చేశారని, ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయని, కేవలం పైప్‌లైన్ వేసి మోటార్ బిగించడమేనని కృష్ణదేవరాయులు స్వయంగా చెప్పారు. అసలు తమ అధినేత చంద్రబాబు ఎందుకు అనుమతులు తీసుకురాలేకపోయారో ప్రజలకు వివరించాలి కదా.
అలాంటిదేమీ లేకుండా మేము రాగానే పూర్తి చేసేస్తామంటే నమ్మేందుకు ఓటర్లు పిచ్చోళ్లు కాదు. ఈ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా అవగాహన ఉన్న.. అనుమతుల కోసం ఎమ్మెల్యేతో కలిసి పనిచేసిన నాటి ఇరిగేషన్ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో పూర్తి చేస్తామని మాచర్ల ప్రజలకు చెప్పారు. అనుమతులు తెచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాబట్టి ఆయన మాటలపై విశ్వాసం ఉంచొచ్చు. అసలు పట్టించుకోని చంద్రబాబు.. ఆయన నీడలో ఉన్న మీ మాటలు ఎలా నమ్మాలి లావు గారూ అనేది పల్నాడు ప్రజానీకం లావు కృష్ణ దేవరాయలు ముందుంచుతున్న ప్రశ్న.