ఆయన గత 34 సంవత్సరాలుగా ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. పైగా 14 సంవత్సరాలుగా సీఎం పీఠంపై కూడా ఉన్నారు. ఇన్ని అధికారాలున్న మరో నాయకుడికి ఇదే అవకాశం దక్కి ఉంటే తన సొంత నియోజకవర్గాన్ని కళ్ళు చెదిరే రీతిలో ఇతర ప్రాంతాలు కుళ్ళుకునేలా అభివృద్ధి చేసి ఉండేవాళ్ళేమో. కానీ 34 ఏళ్ల పాటు గెలుస్తూ కూడా మరోసారి నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడంటే చెప్పేవాడు చంద్రబాబైతే వినేవాళ్ళు కుప్పం ప్రజలై ఉండాలి.
34 ఏళ్లుగా కుప్పం నుండి గెలుస్తూ ఆ ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేసిన చంద్రబాబు మరోసారి తనదైన శైలిలో ఉచిత హామీలిచ్చేశారు. హైదరాబాద్ ని ప్రపంచపటంలో నేనే పెట్టా.. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా. హైటెక్ సిటీ నేనే కట్టా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ పితామహుడిని నేనే, సత్య నాదెళ్లని నేనే సీఈఓ చేశా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చెప్పుకునే చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి చేసిందేమి లేదు.
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పాన్ని పట్టించుకోని చంద్రబాబు తాజాగా కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంతో అనుసంధానిస్తానని చెప్పుకొచ్చారు. కుప్పంలో విమానాశ్రయం కట్టిస్తానని, కుప్పం కూరగాయలు విమానాల్లోపంపిస్తా అని మరోసారి కల్లబొల్లి కబుర్లతో మాయ చేసే ప్రయత్నం చేశారు. నవ్విపోదురుగాక నాదేటి సిగ్గు అన్న చందంగా 30 ఏళ్లుగా గుర్తు రాని కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకి ఇప్పుడు గుర్తొచ్చింది.
వాస్తవానికి చంద్రబాబు పాలనలో వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అభివృద్ధి చేసే బాధ్యత తనపై వేసుకుని, కుప్పంని గ్రామ పంచాయితీ నుండి మునిసిపాలిటీగా రెవెన్యూ డివిజన్ గా మార్చారు. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కారణంగా కుప్పంలో తన సీట్ గల్లంతయ్యే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు మరోసారి తనదైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఇచ్చిన హామీల గురించి ప్రజలెక్కడ అడుగుతారో అని పార్టీ అధికార వెబ్సైట్ నుండి టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. ఇలాంటి చరిత్ర ఉన్న చంద్రబాబుపై కుప్పం ప్రజలకు కూడా విశ్వాసం పోతూ వస్తుంది. అందుకే ఇలా నెరవేర్చలేని అబద్దపు హామీలు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు నవ్వుతారన్న ఆలోచన కూడా లేకుండా నిస్సిగ్గుగా అబద్దపు హామీలిస్తున్న చంద్రబాబుకు ఈసారి కుప్పంలోనే ఎదురుగాలి తగిలేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.