‘నాకేం చెప్పొద్దు. వచ్చి కండువా కప్పించుకో చాలు. లేకపోతే నా సంగతి తెలుసుగా. రేపు పవర్లోకి వచ్చినా.. రాకపోయినా నీ అంతు చూస్తా’ నెల్లూరు రూరల్ తెలుగుదేశం అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులివి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈయన అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. రూరల్ పధిలోని వార్డులు, పంచాయతీల్లో చేరికల విషయంలో రౌడీలా ప్రవర్తిస్తున్నాడని విమర్శలున్నాయి.
ప్రస్తుతం కోటంరెడ్డి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) వెంట నడుస్తున్నాడు. ఆయనకు ఆ పార్టీలో ప్రత్యేకంగా గ్రూప్ లేదు కాబట్టి కోటంరెడ్డితో సన్నిహితంగా ఉంటున్నాడు. తెలుగుదేశంలో తన బలం పెంచుకునేందుకు రోజూ చేరికలుండేలా వీపీఆర్ చర్యలు తీసుకున్నారు. దీనిపై తన మనుషులకు ఆదేశాలిచ్చారు. ఇంకేముంది శ్రీధర్‌రెడ్డి పంట పండింది. ఇప్పటికే ఎన్నికల ఖర్చు మొత్తం వీపీఆర్ చేత పెట్టిస్తున్నాడు. అందుకే సందు దొరికినప్పుడల్లా మా పెద్దాయన.. మా పెద్దాయనంటూ భజన మొదలుపెట్టాడు. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే అందరికంటే ముందు ప్రెస్మీట్లు పెట్టేస్తున్నాడు.
ప్రస్తుతం శ్రీధర్‌రెడ్డి దృష్టంతా వీపీఆర్ నుంచి ఎంత వీలైతే అంత సొమ్ము లాగేయడమే. ఇందులో భాగంగా రూరల్ నియోజకవర్గ పరిధిలోని వార్డులు, పంచాయతీలపై పడ్డాడు. వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు, తటస్తులను టీడీపీలో చేరాలని చెబుతున్నాడు. ఎవరైనా మేము రామంటే బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ వ్యవహారమంతా శ్రీధర్‌రెడ్డి తమ్ముడు గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు సమాచారం. తాము చెప్పినట్లు వినకపోతే అంతు చూస్తామని ఇద్దరూ కలిసి భయపెడుతున్నారు. పార్టీలో చేరేందుకు అంగీకరించిన వారిని వీపీఆర్ వద్దకు తీసుకెళ్లి కండువాలు కప్పిస్తున్నారు. వారు ఫలానా మొత్తం డిమాండ్ చేశారని డబ్బు తీసుకుంటున్నారు. కానీ అందులో పావలా వంతు కూడా చేరిన వారికి ఇవ్వడం లేదని సమాచారం. ఉదాహరణకు రూ.50 లక్షలు తీసుకుంటే రూ.10 లక్షలు మాత్రం ఇచ్చి మిగిలిన మొత్తం జేబులో వేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగకుండా రోజూ శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయంలో 10, 20, 30 కుటుంబాల చొప్పున పార్టీలో చేర్పించుకుంటున్నారు. వీటిని కూడా చూపించి నగదు లాగేస్తున్నట్లు వీపీఆర్ వర్గం గగ్గోలు పెడుతోంది. మొత్తంగా ఎన్నికలు వేమిరెడ్డి చేతి చమురు వదిలిస్తుండగా.. శ్రీధర్‌రెడ్డి లాంటి వారి ఖజానాను నింపుతున్నాయి.