నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. అనతికాలంలోనే నింగికి ఎగసి నేలకు కారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.. కిర్రాక్ ఆర్పీ.. పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కిర్రాక్ ఆర్పీ తర్వాత జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక తనకి అన్నం పెట్టిన మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు. అనంతరం దర్శకుడిగా ఓ సినిమా ప్రారంభించి నిర్మాతతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టించి సినిమా తీయకుండానే నిర్మాతను ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు.. ఈ క్రమంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ప్రారంభించి అనతికాలంలోనే చేపల పులుసు అమ్మకాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
కాగా ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానెల్ పెయిడ్ ప్రమోషన్లతో పాటు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రాంచైజీలు ఇస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. కాగా ఇటీవలకాలంలో గత నెల రోజుల నుండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారయింది పులుసు పరిస్థితి. పేరే తప్ప రుచి లేదు అని కస్టమర్ల నుండి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం అంతేకాకుండా ఆన్లైన్ లో రేటింగ్ కూడా విపరీతంగా పడిపోతూ వస్తుంది.
దానికి తోడు కిరాక్ ఆర్పీ కొన్ని రాజకీయపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పలు రాజకీయ పార్టీల వారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి నెగెటివ్ రేటింగ్ ఇస్తూ వస్తున్నారు. దీంతో రాను రానూ కిరాక్ ఆర్పీ చేపల పులుసుకి రేటింగ్ పడిపోతుండడం మొదలైంది. ఈ క్రమంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో బొద్దింకలున్నాయంటూ నకిలీ వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.. ఇన్ని పరిణామాల మధ్య కిరాక్ ఆర్పీ చేపల పులుసు అంటేనే కస్టమర్లు భయపడి బెంబేలెత్తి పోతూ అనుమానంగా చూసే పరిస్థితి దాపురించింది.