ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానికి తిరిగి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఎంపీ పదవితో పాటు టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు వెల్లడించిన నాని బాటలో ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ట్విట్టర్ ఎక్స్ లో కేశినేని నాని ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు.
కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను సముదాయించేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నించింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఆ భేటీలో నానిని తిరువూరు సభకు రావాలని కోరినా ఆయన తిరస్కరించారు. టీడీపీకి తప్పకుండా రాజీనామా చేస్తానని కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాజీనామా చేయడం ఆలస్యం అవుతుందని నాని వెల్లడించడం గమనార్హం.
గతంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ నాని ఫోటో లేదని కేశినేని నాని వర్గం, కేశినేని చిన్ని వర్గం బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఏర్పడిన పరిణామాల్లో నానికి టికెట్ ఇచ్చేది లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో ఎంపీ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. ఇప్పుడునాని కంటే ముందుగా ఆయన కుమార్తె శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం విజయవాడ రాజకీయాల్లో హీట్ పెంచింది.
కాగా ఫ్లెక్సీలలో ఎంపీ కేశినేని నాని ఫోటో వేయడానికి ఇష్టపడని టీడీపీ అధిష్టానం తిరువూరు సభలో ప్లెక్సీల్లో ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేసి ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. ఈ విషయంపై కేశినేని నాని స్పందిస్తూ గతంలో ప్రోటోకాల్ పాటించకుండా ఇప్పుడు మాత్రం నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారని ఎద్దేవా చేశారు. కాగా ఎంపీ నాని ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా లేక ఇతర పార్టీలవైపు చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.