టీడీపీ పార్టీలో అభ్యర్థుల నామినేషన్ లు మొదలైనా ఇంకా అనేక నియోజకవర్గాలలో సీట్ల కుమ్ములాటలు తగ్గడం లేదు. మొన్న అనపర్తి నిన్న మడకశిర ఈరోజు కావలి అసెంబ్లీ సీటు విషయంలో చంద్రబాబుకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా కావలిలో టీడీపీ పార్టీ తమ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించారు. దీనితో మొన్నటి వరకు నియోజకవర్గ ఇంచార్జీగా వున్న పసుపులేటి సుధాకర్ చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తాము అని హామీతో గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేసి పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని మోసారు. ఇప్పుడు తీరా ఎలక్షన్ వచ్చేసరికి కావ్య కృష్ణరెడ్డి దగ్గర పార్టీ ఫండ్ పేరుతో పదుల కోట్లు తీసుకొని తిరిగి ఎలక్షన్ కు వంద కోట్లు అయిన ఖర్చు పెట్టుకుంటాడు అంటూ అతనికి టికెట్ కేటాయించడంతో తట్టుకోలేక నియోజకవర్గ ప్రజల మద్దతు తనకే వుంది అని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నా అని ప్రకటించి నామినేషన్ వెయ్యడానికి సిద్ధం అయ్యారు సుధాకర్.
ఈ పరిణామంతో కావలి టీడీపీలో కలవరం మొదలైంది. అసలే కావ్య కృష్ణరెడ్డి మీద పార్టీ కార్యకర్తలకు,ప్రజలకు సదభిప్రాయం లేదు, ఇప్పుడు పసుపులేటి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుంటే గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయి అని పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారు. పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా పసుపులేటి వెనక్కి తగ్గడం లేదు. మీరు నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు ఇక టీడీపీనీ,కావ్య కృష్ణరెడ్డినీ వదిలి పెట్టేది లేదు అని తెలిపారు. ఈ కావ్య కృష్ణరెడ్డి వ్యవహారం మొదటి నుండి నియోజకవర్గంలో తేడా గానే వుంది. చంద్రబాబు ప్రజగళం యాత్ర పేరుతో వచ్చినప్పుడు లోకల్ టీడీపీ నాయకులను నమ్మకుండా తన క్వారీ గుమాస్తాలతో నడిపించాలని చూసి చంద్రబాబు సభకు జన సమీకరణ చెయ్యలేక నియోజకవర్గంలో అభసుపాలయ్యారు.
కావ్య కృష్ణరెడ్డి కూటమిలోని మిగిలిన పార్టీలు అయిన బిజెపి, జన సేన పార్టీ నాయకులను నమ్మడం లేదు. వారికి అసలు ప్రచార భాద్యతలు అప్పగించడం లేదు. దగ్గరకి తీసుకోవడం లేదు. దీనితో వారు మమల్ని ఇంతఅనుమానంతో చూస్తుంటే మేము ఎలా పనిచేస్తాము అని ఇప్పటికే దూరం జరిగారు. అలాగే కృష్ణరెడ్డి ఒంటెద్దు పోకడలతో పాటు గుమస్తా లతో సెపరేట్ వర్గాన్ని పెట్టుకోని ప్రచారం, పార్టీ భాద్యతలు వారికే అప్పజెప్పడం తో నియోజకవర్గ కీలక నాయకులు అయిన బీద రవిచంద్ర, మలేపాటి వర్గీయులు పార్టీకి దూరం జరిగారు. కావ్య కృష్ణరెడ్డి ఇప్పటికైనా తన పద్ధతులు మార్చుకోకపోతే టీడీపీ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారిపోతోంది అని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.