పవన్ కళ్యాణ్ ని కాపు నేతలు నమ్మడం లేదా? కాపులంతా పవన్ కళ్యాణ్ కి దూరమయ్యారా? ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఈసారి కూడా సత్తా చాటలేరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. నిలకడలేని రాజకీయాలకు నెలవుగా మారిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలో కాపులలో కొత్త ఆశలు రేకెత్తించారు. తిరుగులేని కాపు నాయకుడిగా ఎదుగుతాడని ఆశిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ కాపు ఓటింగ్ ని గంపగుత్తుగా టీడీపీకి తాకట్టు పెట్టడం కాపులకు నచ్చడం లేదు.
2022లో ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను జనసేన సాధిస్తుందని, గతంతో పోలిస్తే ఊహించని స్థాయిలో పార్టీ పుంజుకుందని జనసేన నేత పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన ఎదుగుతుందన్న ఆశలను వమ్ము చేస్తూ పవన్ కళ్యాణ్ పతనావస్థకు చేరిన చంద్రబాబు పార్టీని లేవనెత్తే ప్రయత్నం చేయడం జనసేనకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. పార్టీ అధినేత ఎవరైనా తన పార్టీ గెలుపు కోసమో బలోపేతం చేయడం కోసమో కృషి చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా కాపులను రాజకీయంగా ఎదగనివ్వని చంద్రబాబు అభ్యున్నతి కోసం కృషి చేయడం కాపులకు మింగుడు పడటం లేదు. దీంతో కాపు ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకుంటున్నారు.
మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతారని ఆశిస్తే బీజేపీతో పొత్తుపెట్టుకుని టీడీపీకి దాస్యం చేస్తుండటం పవన్ కే సాధ్యమైన రికార్డుగా చెప్పొచ్చు. ఏమాత్రం నిలకడలేని నిర్ణయాలతో కాపుల్లో విశ్వసనీయత కోల్పోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఒక్క స్థానంలో అయినా గెలుస్తుందా అనే అనుమానాలు కాపు నాయకుల్లో ఏర్పడి ఒక్కొక్కరుగా జనసేనకు దూరమయ్యారు. ఇప్పటికే కాపు నాడు వ్యవస్థాపకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోగా, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య గారి కుమారుడు సూర్య ప్రకాష్ ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాధా రంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలా బలమైన కాపు నేతలంతా పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చక పార్టీకి దూరం అవుతున్నా పవన్ మాత్రం కాపు ఓటింగ్ తనకే పడుతుందన్న నమ్మకంతో పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించాడు.
ఇప్పటికే టీడీపీ పల్లకీ మోస్తూ కాపు ఓటర్లను టీడీపీకి తాకట్టు పెట్టే ప్రయత్నంలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపుల్లో విశ్వసనీయత కోల్పోయాడన్నది అంగీకరించాల్సిన సత్యం. కానీ ఎక్కువ కాపు ఓట్లు ఉన్నాయన్న ఏకైక కారణంతో ఆ ఓట్లన్నీ తనకే పడతాయన్న అతి విశ్వాసంతో పిఠాపురం నుండి పోటీకి దిగుతానని ప్రకటించడంపై కాపులు గుర్రుగా ఉన్నారు. దానికితోడు పవన్ పోటీకి వ్యతిరేకంగా వర్మ అనుచరవర్గం పిఠాపురంలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాపులకి పవన్ పై నమ్మకం లేకపోవడం పైగా పొత్తులో ఉన్న టీడీపీ కలిసి పనిచేస్తారని గ్యారెంటీ లేకపోవడంతో పవన్ కి పిఠాపురంలో మరోసారి ఎదురుగాలి ఉండబోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇప్పటికైనా పవన్ తాను చేస్తున్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుని కాపులకు చేరువ అవుతారా లేక పూర్తిగా దూరం అవుతారా అనేది ఈ ఎన్నికలతో తెలిసిపోతుంది.