ప్రస్తుత సమాజంలో చాలామంది అనుకున్నది జరగలేదని లేదా పక్కన వాళ్ళతో పోల్చుకుని ఒక నైరాస్యమైన జీవితాన్ని అలవాటు పడిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో పోల్చుకుని నాకు అలా ఉంటే లేదా ఇలా ఉంటే నేను ఏదైనా సాధించే వాడిని ఎంత దాకా అయినా తెగించి పోరాడేవాన్ని అంటూ తమని సమర్థించుకుంటూ కాలం గడుపుతుంటారు. కానీ కొంతమందిని చూసినప్పుడు మాత్రం మన స్థితిగతులు ఎలా ఉన్నా మన పరిస్థితులు ఏమైనా ఎలాంటి దుస్థితిలో ఉన్నా సంకల్పం గొప్పదైతే ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు అనిపిస్తుంది.
ఆ కోవకే చెందుతుంది ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన ఆదిలక్ష్మి అనే అమ్మాయి.. సాధించాలనే తపన పట్టుదల ఉండాలే కాని ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా గమ్యాన్ని చేరగలమని నిరూపించింది. మన లక్ష్యానికి సంకల్ప బలం తోడైతే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించి తీరుతామని రుజువు చేసింది. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని పంటి దిగువన భరించింది. ప్రతి బాధను ఆవేదనను గుండె లోతుల్లో దాచుకుంది. నష్టం ఎదురుగా కనబడుతున్న కాస్త కూడా చలించకుండా లక్ష్యం వైపుకే దూసుకువెళ్లింది. కష్టాలకు కన్నీళ్ళకు ఎదురు నిలబడి పోరాడి పడిన చోటే తల ఎత్తుకుని గర్వంగా నిలబడింది. ఆదిలక్ష్మి చిన్నప్పటినుండి చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకుని ఉన్నత స్థానంలో నిలబడాలి అనేది ఆమె కల… జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టుకోవాలనేది ఆమె చిరకాల వాంఛ.
అయితే ఆమె తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు పేదరికం అందుకు సహకరించలేదు. ఆమె కలలకు అడ్డంకులుగానే మిగిలాయి. దానికి తోడు వారిది పెద్ద కుటుంబం కావడంతో చదివించే స్తోమత లేక ఎనిమిదో తరగతి తర్వాత 13 ఏళ్ల వయసులోనే ఆమెకి పెళ్లి చేశారు. అక్కడితో వారి బాధ్యత తీరిపోయింది అని చేతులు దులుపుకున్నారు . అయితే చదువు మీద ఆసక్తి ఏమాత్రం తగ్గని ఆదిలక్ష్మి ఎలాగైనా చదువుకోవాలని తపన పడింది. పెళ్లి తర్వాత చదువుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోగా తన భర్త కోపానికి గురి అయింది. దానితో చేసేదేమీ లేక ఎలాగైనా చదువుకోవాలని లక్ష్యంతో భర్తకు విడాకులు ఇచ్చింది.
భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం ఆదిలక్ష్మి చదువును కొనసాగించడానికి అనేక కష్టాలు పడింది. ఒకరి ఇంట్లో హౌస్ మైడ్ గా పని చేస్తూనే ఇంటర్మీడియట్ చదువుకోడానికి అడుగులు ముందుకు వేసింది. తన కష్టం ఫలించి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్మీడియట్ అనంతరం కాకినాడలోనే ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసింది. అయితే మొదటినుంచి తెలుగు మీడియం లో చదువుకున్న ఆదిలక్ష్మి ఇంగ్లీష్ రాక కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఫైనల్ గా మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేసింది.
అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఒకటికి మూడు మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని కాదనుకుని ఆర్థిక పరిస్థితి ఏంటో తన స్థితిగతులు ఏంటో తెలిసి కూడా ఒక అడుగు ముందుకు వేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ కాసాగింది. ఆ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించి ఇండో టిబెట్ పోలీస్ ఫోర్స్ కు ఆమె సెలెక్ట్ అయింది. ఇంతకాలం తను పడిన కష్టాలకు ఎదురైన ఇబ్బందులకు మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధించి తనకల నెరవేర్చుకుంది. ఇన్ని కష్టనష్టాలలో కూడా తను కన్న కల నెరవేర్చుకున్న కూతుర్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఆనందభాష్పాలు వ్యక్తం చేస్తున్నారు.