ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదని ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేయడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ వెల్లడించింది.
కాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పత్రాలను విడుదల చేశారు. కానీ అవి ఫోర్జరీవని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 2016లో కాకాణిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీ కావడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైళ్ల చోరీపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ ఏడాది పాటు విచారణ జరిపి, 88 మంది సాక్షులను విచారించి, 403 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించడంతో పాటు పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్లో స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది.