టీడీపీ భవిష్యత్ కార్యాచరణను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రా.. కదలిరా సభలకు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఇప్పటికే పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితుల్లో టీడీపీని తిరిగి బ్రతికించేందుకు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా విఫలయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ యువగళం అంటూ పాదయాత్ర చేసినా ప్రజాదరణకు నోచుకోలేదు. దాంతో చంద్రబాబు రా.. కదలిరా పేరుతో నియోజక వర్గాల వారీగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ సభలకు ఎన్టీఆర్ అభిమానుల నుండి వ్యతిరేకత ఎదురవుతుండడంతో టీడీపీ వర్గాలలో కలవరం మొదలైంది.
గతంలో లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలోనూ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. తాజాగా చంద్రబాబు నిర్వహిస్తున్న రా.. కదలిరా సభల్లో ఆయన అభిమానులు ‘జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తుండడంతో వారిని ఎలా సముదాయించాలో తెలియక టీడీపీ నాయకత్వం తలలు పట్టుకుంటుంది. తిరువూరు సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ అభిమానులకు మధ్య ఘర్షణ జరిగి బాహాబాహీకి దారితీసింది. టీడీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హైలెట్ అయ్యాయి. తాజాగా ఆళ్లగడ్డ సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు ప్రత్యక్షం కావడంతో వారి పట్ల ఎలా స్పందించాలో టీడీపీ నాయకులకు అర్థం కావడం లేదు.
2009 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో ఆయనకు ఆక్సిడెంట్ కూడా కావడం గమనార్హం. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, అనంతరం చోటు చేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో లోకేష్ ను టీడీపీలో ప్రధాన నాయకుడిగా మార్చడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి టీడీపీ కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నందమూరి కుటుంబ సభ్యులంతా ఆ అరెస్టును ఖండించినా ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. దీన్ని తప్పు బడుతూ టీడీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభల్లో ఎన్టీఆర్ ను కూడా తీసుకురావాలంటూ ఆయన ఆయన అభిమానులు ఫ్లెక్సీలు, ఫోటోలతో హల్ చల్ చేయడం టీడీపీ అభిమానులకు రుచించడం లేదు. దాంతో వారు బహిరంగ దాడులకు దిగుతున్నారు. ఎన్టీఆర్ విషయంలో ఎలా స్పందించాలో తెలియక టీడీపీ అగ్ర నాయకత్వం తలలు పట్టుకుంటుంది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏదొక నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించాలని ఇరువర్గాల అభిమానులు కోరుకుంటున్నారు. లేదంటే ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల కారణంగా పార్టీకి మరింత చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.