‘గతి లేని పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా. విశాఖను రాజధాని చేయమన్నా చంద్రబాబునాయుడు వినలేదు. నేను స్వతహాగా బాబును ద్వేషిస్తా. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని అధిష్టానం అడిగింది. ఇక్కడ బలమైన నాయకుడు లేడు కాబట్టి రాలేనని చెప్పా. టీడీపీలో ఉన్నా రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్‌ను మరిచిపోలేను. కాకపోతే ఇప్పటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండక తప్పదు’ 2021లో తెలంగాణ అసెంబ్లీలో జేసీ దివాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలే జేసీ కుటుంబం రాజకీయాల్లో పతనం కావడానికి కారణమయ్యాయనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.
జేసీ దివాకర్‌రెడ్డి.. ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేశారు. అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగానూ వ్యవహరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాను శాసించారు. ఈయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా 2014లో గెలిచారు. దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి 19లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రభాకర్‌రెడ్డి తనయుడు అశ్మిత్‌రెడ్డి 19లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
ఈ బ్రదర్స్ రాజకీయంగా వేసిన తప్పటడుగులు, నోటి దురుసుతో అస్తిత్వం కోల్పోయారు. గతంలో దివాకర్‌రెడ్డి అన్న మాటలు గుర్తు పెట్టుకున్న చంద్రబాబు కుటుంబానికి ఒక టికెట్ పేరుతో జేసీకి ఝలక్ ఇచ్చారు. పవన్‌రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. అనంతపురం ఎంపీగా అంబికా లక్ష్మీ నారాయణని బరిలోకి దింపారు. జేసీ ఫ్యామిలీలో కేవలం అశ్మిత్రెడ్డికి మాత్రం పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో పలు జిల్లాల్లో కుటుంబాల్లో ఇద్దరికి చాన్స్ ఇచ్చారు. ఉదాహరణకు అచ్చెన్నాయుడికి, రామ్మోహన్‌కు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, ఆయన భార్యకు.. దీంతో నమ్ముకున్నందుకు బాబు బాగా బుద్ధి చెప్పాడని జేసీ ఫ్యామిలీ సన్నిహితులతో వాపోయింది.
అనేక వేదికలపై దివాకర్‌రెడ్డి చంద్రబాబును ఇరుకున పెట్టేలా మాట్లాడారు. నిలదీసిన సందర్భాలున్నాయి. ఇక ప్రభాకర్‌రెడ్డి అనంతపురంలో చేరి సొంత పార్టీనే తిట్టేవాడు. దీంతో బాబు వారి రాజకీయ జీవితాన్ని అధఃపాతాళంలోకి పంపేశాడు. గతి లేకే టీడీపీలో కొనసాగుతున్నామని జేసీ అన్న మాటలు ఎంత పనిచేశాయో.. ప్రస్తుతం ఆ జిల్లా రాజకీయాల్లో జేసీ ముద్ర లేదు. తనను ఎవరైనా అంటే బాబు నవ్వుతాడు. సమయం దొరికినప్పుడు ప్రతాపం చూపిస్తాడు. చాలామంది నేతల జీవితాలను ఇలాగే నాశనం చేసేశాడు.