నాయకుడిని నమ్ముకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అదే వెన్నుపోటు దారుడిని నమ్ముకుంటే ఏ రోజుకైనా నట్టేట మునగాల్సిందే. ఈ విషయం త్వరలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అర్థమవుతుంది. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశంతోనే మొదలైంది. అయితే అక్కడ ఎదగలేకపోయారు. కాంగ్రెస్‌లో చేరగా.. దివంగత సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి పుణ్యాన 1999లో గురజాల నుంచి గెలిచారు. 2004లోనూ వైఎస్సార్ వల్ల ఎమ్మెల్యే అయ్యారు. తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా అవకాశం కల్పించారు.
అందరూ చెప్పినా..
జంగా అంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే 2014 ఎన్నికల సమయంలో ఓడిపోతారని సీనియర్ నాయకులంతా చెప్పినా ఈ బీసీ నేతకు అండగా నిలిచి టికెట్ ఇచ్చారు. అయితే కృష్ణమూర్తి ఓడిపోయారు. 2019లోనూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో టికెట్ వద్దని కాసు మహేష్‌ను బరిలోకి దించారు. ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. వేరే పదవులు ఇచ్చి అండగా ఉంటానన్న హామీని జగన్ నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్సీని చేశారు. పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిని చేశారు. శాసనమండలిలో విప్ పదవితో గౌరవించారు.
ఎందుకీ వ్యాఖ్యలు
నేడు జంగా పూర్తిగా తెలుగుదేశం ట్రాప్‌లో పడ్డారు. ఆదరించి పెద్ద చేసిన వైఎస్సార్సీపీ, అండగా నిలిచిన సీఎం జగన్‌పై బురద వేస్తున్నారు. కృష్ణమూర్తి బీసీ. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు దక్కాయి. ఆ విషయాన్ని మర్చిపోయి జగన్ బీసీలను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు వైఎస్సార్సీపీ అధినేత తన పాలనలో బీసీలకు ఏం చేశారో జంగాకు తెలియక కాదు. మంత్రివర్గంలో 11 మంది అవకాశం కల్పించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.2.55 లక్షల కోట్లు అందిస్తే అందులో రూ.1.80 లక్షల కోట్ల మేర లబ్ధి పొందింది బీసీలే. మున్సిపల్, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఎంపీపీలు అయిన బీసీలు ఎందరో ఉన్నారు. చంద్రబాబులా జగన్ ఏనాడూ అవమానించలేదు. బ్యాక్‌బోన్ క్లాస్లా చూశారు. అసలు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ బీసీ. బాబు ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వలేదు. జగన్ నలుగురికి అవకాశం కల్పించారు. ఆరుగురిని జెడ్పీచైర్మన్లు చేశారు. తొమ్మిది చోట్ల మేయర్ పదవులిచ్చారు. బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వారిని తిట్టిపోసిన ఘనుడు చంద్రబాబు నాయుడు.
జంగా వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, నరసారావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఫైరయ్యారు. చంద్రబాబు మాటలను జంగా గుడ్డిగా నమ్మాడరన్నారు. గురజాలలో అవకాశం లేకపోవడంతో కృష్ణమూర్తికి జగనన్న నరసారావుపేట ఎంపీ టికెట్ ఇస్తానన్నారు. అందుకు ఒప్పుకోకుండా టీడీపీ మాయలో పడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చిందో చూడాలన్నారు. జగన్‌ను నిజంగా అభిమానించే వారెవరూ పార్టీ మారరన్నారు.
అసలు జంగా కృష్ణమూర్తికి బాబు ఏం ఆఫర్ ఇచ్చాడో గానీ.. స్క్రిప్ట్ మొత్తం అప్పజెప్పాడు. దానిని ఎల్లో మీడియా హైలెట్ చేసింది. సీట్ల మార్పు.. రాజకీయ పార్టీల్లో సర్వసాధారణం. చాలామంది పోటీ చేయాలని ఆశిస్తుంటారు. అయితే అధినేతలు తమ వ్యూహాల్లో భాగంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. అడిగిన వారందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. చాన్స్ లేదని చెప్పినా కొందరు అర్థం చేసుకుంటారు. మరికొందరు బలైపోతుంటారు. వైఎస్సార్సీపీలో ఎవరికైనా టికెట్ దక్కదని తెలిస్తే చాలు చంద్రబాబు వారిని ప్రలోభపెట్టి తీసుకుంటున్నాడు. జగన్‌ను తిట్టిస్తున్నాడు. నారా వారి సంగతి జంగాకు బాగా తెలుసు. ఆ పార్టీలో పనిచేసి ఎదగలేకపోయాడు కదా.. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేతను తిట్టాడని కృష్ణమూర్తిని బాబు అందలమెక్కించడు. జస్ట్ కరివేపాకులా వాడుకుని వదిలేస్తాడు. ఇది తెలుసుకునే సరికి జంగా రాజకీయ జీవితం సమాధి అయిపోయి ఉంటుంది.