ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యం అంటూ పొత్తులు కలుపుకున్న టీడీపీ జనసేన పార్టీలు టికెట్ల సర్ధుబాటు విషయం వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే కింద తయారయ్యారు. ఇప్పటికే ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్ధులో తెలియక అటు జనసేన ఇటు టీడీపీ ఆశావాహులు తమకంటే తమకే టిక్కెట్ అని ప్రచారం చేసుకుంటుంటే, అభ్యర్ధులని ప్రకటిస్తున్న నియొజకవర్గాల్లో సైతం పొత్తు ధర్మంలో భాగంగా ఇరుపార్టీల సమక్షంలో అభ్యర్ధులని ప్రకటించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
తాజాగా రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణను నిర్ణయిస్తూ టీడీపీ పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చన్నాయుడుతో పాటు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలమేరకు సత్తెనపల్లి శాసనసభ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారని అచ్చన్నాయుడు ప్రకటించారు. అయితే ఈ సమావేశంలో ఎక్కడా కూడా జనసేన ఆశావహులు కాని, జనసేన నాయకులు కానీ కనపడకపోవడం చర్చనీయంశంగా మారింది.
కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు ఇప్పటివరకు భావిస్తు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారం చేసుకున్నారు, జనసేన పార్టీ ఇన్చార్జి బొర్రా వెంకట అప్పారావుకు గానీ, మరో నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు గానీ అవకాశం రావచ్చనే చర్చ నిన్నటి వరకు జరిగింది. అయితే వీరెవ్వరు సమావేశంలో లేకుండానే సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణను నిర్ణయిస్తూ టీడీపీ పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఆ తరువత జరిగిన ర్యాలీలో సైతం జనసేన వారు కనపడకపోవడం వారి మధ్య ఉన్న విభేధాలు బయటపడేలా చేశాయి.
ఇప్పటికే కన్నాకి వ్యతిరేకంగా ఆర్థిక, అంగబలం ఉన్న బొర్రా అప్పారావు నియోజకవర్గంలోని కాపు నేతలను ఏకం చేసి జనసేనకు టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ తరఫున కన్నా గెలిచినా పెత్తనం ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందని ప్రచారం చేస్తు వచ్చిన నేపధ్యంలో వారితో ఎలాంటి సంప్రదింపులు లేకుండా టీడీపీ కన్నాకి టికెట్ కేటాయిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుకోవడం చూస్తే జనసేన ఆశావహుల అభిప్రాయాలకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదనే మాట నియోజకవర్గ కాపునేతల్లోని ఒక వర్గం వ్యక్తంచేస్తుంది. అలాగే తాము కన్నా గెలుపుకి కృషి చేసేదిలేదని కూడా వారి సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం.
మరోపక్క తెలుగుదేశం సీనియర్ నాయకులు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం సైతం తెలుగుదేశం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సరావుపేటలో స్థానికంగా స్థిరపడిన తమను చంద్రబాబు 2014 ఎన్నికల్లో సత్తెనపల్లికి తెచ్చి చివరికి ఏ నియోజకవర్గానికి కాకుండా చేసి తమ గొంతు కోశారని ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపధ్యంలో కొడెల శివరాంతో కనీసం చర్చించకుండానే కన్నా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయడం శివరాం వర్గానికి మింగుడుపడని విషయం. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో సత్తెనపల్లిలో బలంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పై విజయం సాధించడం సాధ్యంకాదని టీడీపీ వర్గాలే బహిరంగంగా చెప్పడం చూస్తే కన్నాకి మరోసారి పరాభవం తప్పదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.