దిశ.. అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించిన అభయం. ఆకతాయిల బారి నుంచి యువతులను రక్షించేందుకు, గృహ హింస బాధితురాళ్లకు నిమిషాల్లోనే అండగా నిలిచి వారి కంట నీరు తుడిచేందుకు తెచ్చిన వజ్రాయుధం ఈ చట్టం. దిశ యాప్ స్మార్ట్ ఫోన్లో ఉంటే చాలు. రాత్రి, పగలనే లేకుండా ఏ సమయంలోనైనా కష్టం వచ్చిందని ఆ యాప్ ద్వారా సమాచారం ఇస్తే పోలీసులు వాయువేగంతో స్పందిస్తారు. ఇక దిశ పోలీస్ స్టేషన్లు.. మహిళలు నేరుగా వెళ్లి సమస్యలు చెప్పుకొనేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. నాడు సమస్యలు బయట పెట్టించేందుకు భయపడిన పరిస్థితులు ఉంటే.. నేడు దిశ ధైర్యాన్ని ఇస్తోంది. మృగాళ్ల బారి నుంచి రక్షించబడి ఆనంద భాష్పాలు రాల్చిన వనితలు ఎందరో..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు, యువతులు, చిన్నారులపై దాడులు నిత్యకృత్యంగా ఉండేవి. బాధితులు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. వారిపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు నిర్ణయించారు. తెలంగాణలో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో ఇక్కడ అలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు ఏపీ దిశ యాక్ట్-2019ను రూపొందించి శాసనసభలో ఆమోదించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2020 సంవత్సరంలో సీఎం రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. మొత్తం 18 స్టేషన్లున్నాయి. ఇంకా మహిళా సమస్యల పరిష్కారం కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో సంరక్షణ కార్యదర్శులను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర కూడా ప్రకటించాయి.
ఏమి చేశారంటే..
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జీ సెక్షన్లను అదనంగా చేర్చారు. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. దర్యాప్తు కోసం రాష్ట్రంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లున్నాయి. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం జరిగింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్షను విధిస్తారు. లైంగికదాడి కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీల్ చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదించారు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్లైన్) రిజిస్టర్లో నమోదు చేస్తారు. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునికీకరణ, తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్ఏ సెంటర్లు, బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్‌లు దిశ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్స్, కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష, రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్, ఒక డీఎస్పీ, మూడు ఎస్సై పోస్టుల మంజూరు, బాధితుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ, అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ సౌకర్యం తదితర చర్యలు తీసుకున్నారు.
అలాగే ఆపదలో ఉన్న అతివలకు దిశ యాప్ ఆయుధమైంది. మహిళలు, యువతులకు ఈ యాప్ బ్రహ్మాస్త్రంగా మారింది. దీనిని వినియోగించుకుని ఇప్పటికే వేల సంఖ్యలో మహిళలు రక్షణ పొందారు. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్లో దిశ యాప్ రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు తీసుకున్నారు. రక్షణ ఎలా పొందాలన్న విషయంపై మహిళా సంరక్షణ కార్యదర్శులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా అవగాహన కల్పించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 1.15 కోట్ల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో..
నెల్లూరులోని జిల్లా సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు వివిధ సమస్యలపై 4,774 ఫిర్యాదులు అందగా, కౌన్సెలింగ్ ద్వారా 4,075 సమస్యలను పరిష్కరించారు. 665 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. మిగిలిన ఫిర్యాదులకు సంబంధించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇక దిశ ఎస్ఓఎస్కు వివిధ సమస్యలపై 1,994 కాల్స్ వచ్చాయి. 129 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటుండటంతో నిందితులకు శిక్షలు పడుతున్నాయి.