రాష్ట్రంలో చిరు వ్యాపారులకు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి, హస్త కళాకారులకు అండగా నిలిచేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి జగన్ నేడు 8 వ విడత మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి తమ కాళ్లపై తాము నిలదొక్కుకొనేలా ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తూ ఆ రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు.
ఇప్పటికే 7 విడతల్లో రుణాలను, వడ్డీలని లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయగా నేడు 8వ విడతగా 3,95,000 మందికి రూ.417.94 కోట్ల రుణం అందించనున్నారు. ఇప్పటివరకూ మొత్తంగా 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర ప్రభుత్వం అందించిన వడ్డీ లేని రుణాలు అక్షరాలా రూ. 3,374 కోట్లు. 8వ విడతలో అందించే వడ్డీతో కలిపి ఇప్పటివరకు 15.87 లక్షల లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలవడం గమనార్హం.
ఎవరెవరు అర్హులు ?
10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు తోపుడు బండ్లపై వివిధ రకాల వస్తువులు ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు,సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు,చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు జగనన్నతోడు పథకం అందిస్తున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారు, హస్త కళాకారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా జగనన్న తోడు‘ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించడం అభినందనీయం.