ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అన్నదాతలు బాగుండాలని అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకానికి శ్రీకారం చుట్టారు. అమూల్ సంస్థ వల్ల తమకు లబ్ధి జరుగుతోందని రైతులు నమ్మడంతో పాలు పోసే వారి ఎంతగానో సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాల సేకరణ జరుగుతోంది.
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాని తర్వాత అనేక మంది రైతులు పాడి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. ఒకప్పుడు ప్రైవేట్ డెయిరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవి. పాడి రైతులను దోచుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మారింది. విప్లవాత్మక ఆలోచనలతో అమూల్ సంస్థను తీసుకురావడంతో పాడిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2020 సంవత్సరం డిసెంబర్లో పాలవెల్లువ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తొలుత మూడు జిల్లాల్లో మొదలైన ఈ ప్రాజెక్టు నేడు 19 జిల్లాలకు విస్తరించింది. ఈ ఉద్యమంలో 3,78,567 మంది భాగస్వాములయ్యారు. తొలిరోజుల్లో రోజూ పాలు పోసే వారి సంఖ్య 800 ఉండగా నేడు లక్షకు చేరుకుంది. అప్పట్లో రోజుకు సగటున 1,800 లీటర్లు పాలు పోయగా ఇప్పుడు ఏకంగా 3.61 లక్షల లీటర్ల సేకరణ జరుగుతోంది. ఇది అరుదైన రికార్డుగా సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
రైతులకు ఉపయోగాలెన్నో..
అమూల్ సంస్థ ప్రారంభంలో 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.74 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ ఆవు పాలకు రూ.34.20 చొప్పున ఇవ్వగా మూడు సంవత్సరాల్లో ఏకంగా ఏడుసార్లు పాల సేకరణ ధరలను పెంచి రైతులకు అండగా నిలిచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ఉత్పత్తి తగ్గుదల, పెరుగుదలతో సంబంధం లేకుండా ధరలను స్థిరంగా కొనసాగిస్తోంది. అలాగే ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఆధారంగా పాలు పోసిన 10 రోజుల్లో నేరుగా పాడిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. 180 రోజులపాటు క్రమం తప్పకుండా పాలు పోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున అమూల్ సంస్థ బోనస్ ఇస్తుండడం భరోసానిస్తోంది. ఈ మూడేళ్లలో బోనస్ కింద రూ.4.93 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. 3,090 మంది రైతులకు పాడి కొనుగోలకు రూ.30.01 కోట్లు రుణాలిచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలు దాదాపు పూర్తి కావొచ్చింది. జేపీవీ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 12.70 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.575.42 కోట్లను పాడి రైతుల ఖాతాల్లో జమ చేసింది.
తేడా ఇదీ..
ఒకప్పుడు హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు అనేకచోట్ల విజయ డెయిరీని నిర్వీర్యం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన పాలనలో ప్రైవేట్ డెయిరీలు రాజ్యమేలాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ డెయిరీలు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయో.. ఎలా నష్టపోతున్నారో.. పాడి రైతులకు అవగాహన కల్పించడంతో అమూల్ సంస్థ వైపు మొగ్గు చూపారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం హెరిటేజ్ సంస్థ కోసం అమూల్‌పై మాటలదాడి చేశాయి. ఈ పథకంపై పాడిరైతులు నమ్మకం కోల్పోయేలా ప్రవర్తించాయి. అయితే వారి కుట్రలను లక్షలాది మంది తిప్పికొట్టి పాలు పోసి లబ్ధిపొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
– వీకే..