‘అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సచివాలయాన్ని సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. సిద్ధం సభల తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై దిశానిర్దేశం చేశారు.
సీఎం మాటల్లో.. మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది. దీనిని చక్కగా వినియోగించుకోవాలి. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. ప్రజలతో మమేకమై ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మేరకు అభ్యర్థులు కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలి. ఈ అంశాలపై కో–ఆర్డినేటర్లు వారికి మార్గనిర్దేశం చేయాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశాం. వారికి ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులును, నాయకత్వాన్ని సంఘటితపరిచి, వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలి. పార్టీ లక్ష్యాలు సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్ని వినియోగించుకుని, ఘన విజయాలు నమోదు చేయాలి. కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలి. అలాగే బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్ని రకాలుగా సిద్ధం కావాలి. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సభలను జయప్రదం చేయాలి.
ఎన్నికల నేపథ్యంలో పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే పనిలో జగన్ నిమగ్నయ్యారు. ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమి చేయాలో ఆదేశాలిస్తున్నారు.