ఏపీలో ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. సీఎం జగన్ మాత్రం రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో తన ప్రసంగాల ద్వారా వెల్లడిస్తున్నారు. తాజాగా హిందూపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునేవాడు కాదు అని స్పష్టం చేస్తూనే చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే తిరుగుతుండడంతో పాటు ఎల్లో మీడియా సీఎం జగన్ పై చేస్తున్న అసత్య ప్రచారం కారణంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. సీఎం జగన్ హిందూపురంలో చేసిన కామెంట్స్ కారణంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలతో పాటు సామాన్యుల్లో కూడా విస్తృత చర్చ జరుగుతుంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు దాదాపుగా 31లక్షల ఇళ్ల స్థలాలను మంజూరు చేసి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా వారికి సకల సౌకర్యాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే లక్షలాది ఇళ్ళు పూర్తవగా మిగిలిన వాటి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.
కానీ చంద్రబాబు తీరు ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ లో 8 వేల ఎకరాల భూమిని కొల్లగొట్టారని ఆరోపణలున్నాయి. మరోవైపు సైబర్ సిటీ అంటూ ప్రచారం చేసుకుని దాని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది. ఇదంతా పక్కనబెడితే చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమరావతి రాజధాని ముసుగులో 33 వేల ఎకరాల రైతుల భూములను, 23 వేల ఎకరాల ప్రభుత్వ భూములను సేకరించి తన సామాజిక వర్గ వ్యక్తులకు కట్టబెట్టారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఇన్ని వేల ఎకరాల భూములను మాయం చేసిన చంద్రబాబు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్ ప్రజల భూములను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కొల్లగొట్టబోతున్నారని ప్రచారం చేస్తుండటం చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు.
వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసిన సంస్కరణలు ఇన్నేళ్ల దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలు.. కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి పోవాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చింది. కానీ ప్రజలను భయాందోళనలు రేకెత్తించి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తన అనుకూల మీడియా ద్వారా పథకం రచించిన చంద్రబాబు ఈ యాక్ట్ పై విషప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో వేలాది ఎకరాల భూమిని కొల్లగొట్టి తన సామాజిక వర్గ వ్యక్తులకు నేతలకు అందించిన చంద్రబాబు తాను చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకునేందుకు సీఎం జగన్ పై నీలాపనిందలు వేయడానికి కూడా వెనుకాడటం లేదు. కానీ ప్రజలు విజ్ఞులు కనుక చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి చంద్రబాబుకు తగినవిధంగా ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.