సొంతిల్లు.. ఇది పేద ప్రజల కల. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన తర్వాత వచ్చిన సీఎంలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో నిరుపేదలకు గూడు కల్పించేందుకు నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. కొత్త ఊర్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 30,76,018 మంది మహిళలకు ఖరీదైన ప్రాంతాల్లో ఉచితంగా పట్టాలిచ్చారు. 70,811.50 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేసి ప్రభుత్వమే నీరు, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ తదితర సౌకర్యాలు కల్పించింది. శరవేగంగా ఇళ్లు కట్టిస్తున్నారు. ఇప్పటివరకు సర్కారు ఈ పథకంపై రూ.76,670.05 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. వైఎస్సార్, జగనన్న కాలనీలుగా పిలుస్తున్న ఈ ప్రాంతాల్లో చాలా ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
సాయం ఇలా..
ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందిస్తోంది. అలాగే లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ఇలా చేయడంతో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుతోంది. ఇంకా అనేక విధాలుగా సాయం చేస్తూ ఒక్కో ఇంటిపై రూ.2.70 లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది. అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్మాణాలను పూర్తి చేయిస్తోంది. అధికారులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో లేఅవుట్లను సందర్శిస్తున్నారు.
తక్కువ వడ్డీకి రుణాలు
ఇళ్ల లబ్ధిదారుల్లో పొదుపు మహిళలుంటే వారికి పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైగా ఆ వడ్డీ భారం వారిపై పడకుండా జగన్ సర్కారు నగదు చెల్లిస్తోంది. గృహ నిర్మాణదారులకు ఇది బాగా కలిసొచ్చే అంశం. సాధారణంగా రుణం తీసుకుంటే 8 నుంచి పది శాతం వరకు వడ్డీ పడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12.77 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,500 కోట్ల రుణం అందింది. ఈసారి అర్హులైన 4,07,323 మందికి వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళలకు ఆస్తి
జగన్ ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుండటంతో ఒక్కో మహిళకు సుమారు రూ.10 లక్షల పైన ఆస్తి సమకూరింది. ఇప్పటికే 8.6 లక్షలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. బాడుగ గృహాల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతూ ఉంటున్న కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. వారందరికీ జగన్ అండగా నిలిచి ‘ఇదిగో నా ఇల్లు’ అని చూపించి గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు.