ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. గెలుపు లక్ష్యంగా ఆయా పార్టీల నాయకులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ కూడా, అయితే రాష్ట్ర రాజకీయాలలో పవన్ గెలుపోటములు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అని చెప్పొచ్చు … పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
నిజానికి నాయకుడు అనే వాడికి తనను తాను గెలిపించుకోవడమే కాకుండా తనతో పాటు మరొక పదిమందిని గెలిపించుకునే సత్తా ఉండాలి. తన తోటి వారికి కచ్చితంగా గెలిచి తీరుతామనే నమ్మకాన్ని కలిగించే లాగా నాయకత్వం ఉండాలి. కానీ, పిఠాపురంలో పవన్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా రివర్స్ లో ఉంది. మిగిలిన వాళ్ళ సంగతి ఏమోగానీ తనని గెలిపించడానికే అందరూ కష్టపడాల్సి వస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాల్సివస్తుంది. ఒకపక్క మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు ప్రశ్నార్థకంగానే మిగిలింది. మరొకపక్క తన సామాజిక వర్గానికి సంబంధించి 90 వేల మంది సమూహం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కి తన గెలుపు పై నమ్మకం కుదరడం లేదు.
అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో మొత్తం ఒక్కొక్కరుగా పిఠాపురంలో హల్చల్ చేస్తున్నారు. వీరితోపాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ నటులు కూడా తోడయ్యారు. అంతేకాకుండా ఎన్నికలలోపు చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారానికి వస్తాడు అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేటువంటి నమ్మకం మాత్రం ఎక్కడా కుదరడం లేదు. కారణం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విద్యావంతురాలు, నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు, పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన వంగా గీత ప్రత్యర్థి కావటమే అంటున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక రెండు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే.