ఎల్లో మీడియా రాతలన్నీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తగినట్లుగానే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అలియాస్ చంద్రజ్యోతి అక్షరాలు నిత్యం పచ్చ రంగును పూసుకుని ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో చాలారోజులుగా రాధాకృష్ణ పత్రిక తెలివిగా వ్యవహరిస్తోంది. జనసేన, బీజేపీలను తక్కువ సంఖ్యకే పరిమితం చేసి, టీడీపీ నాయకులకు ఎక్కువ సీట్లు వచ్చేలా రాతలు రాస్తోంది. వారికి అక్కడ బలం లేదు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి చాలా వీక్ అంటూ రాసింది. అదే చంద్రబాబు విషయానికొచ్చే సరికి వ్యూహాలు, కొత్త ఎత్తుగడలని కలరింగ్ ఇస్తోంది. తెలుగు తమ్ముళ్లకు అవసరమైన సీటు కూటమిలోని ఇతర పార్టీలకు వెళ్తే.. తిరిగి టీడీపీకే ఇచ్చే వరకూ కట్టు కథలు వండి వారుస్తూనే ఉంటుంది. తాజాగా అనపర్తి సీటు విషయంలో ఇదే జరుగుతోంది. దీంతో మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు చంద్రజ్యోతికి సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని అనపర్తి సీటును తొలుత ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బాబు భారీ మొత్తానికి అమ్మేశారు. తర్వాత తానే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా వారు శివకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నల్లమిల్లి తన తన అనుచరులను రెచ్చగొట్టారు. వారు ఆందోళన కార్యక్రమాలు చేశారు. చంద్రబాబునే దూషించారు. దీంతో భయపడిపోయిన టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఆ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా చంద్రజ్యోతి తెలివిగా రాతలు రాస్తోంది.
అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు వ్యూహం మార్చారు. బీజేపీ అభ్యర్థికి స్థానికంగా పట్టులేదని, పోటీ చేస్తే ఓడిపోతాడని రాసుకొచ్చింది. కమలనాథులే పునరాలోచనలో పడ్డారని తన ఆలోచనను బయటపెట్టింది. చెప్పిన మాట వినే పురందేశ్వరి ఉండడంతో ఇలా రాసి ఆమె ద్వారా బీజేపీకి ఈ స్థానం దక్కకుండా చేయాలనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీనిపై ఐవైఆర్ ఫేస్బుక్ వేదికగా స్పందించారు. ‘స్థానికంగా ఎవరికి పట్టు ఉన్నది ఆర్కే గారూ?, రాజమండ్రిలో పురందేశ్వరి గారికా, ఆదోనిలో పార్థసారథి గారికా?, ధర్మవరంలో సత్యకుమార్ గారికా?, విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి గారికా?.. మనకు కావాల్సిన అభ్యర్థులకు స్థానికత గుర్తుకు రాదు. తొలగించాలి అనుకున్నప్పుడు స్థానికత అంశం అవుతుంది. ఏపీ బీజేపీ దౌర్భాగ్యం ఎవరు పోటీ చేయాలనేది ఇంకొకరు నిర్ణయిస్తారు. ’ ఇది ఆయన పోస్టు.
కూటమిలో ఉన్న బీజేపీకి చెందిన ఐవైఆర్ స్పందన ఇలా ఉంటే ఇక సీనియర్ కార్యకర్తలు ఏ విధంగా బాధపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ కమలం పార్టీ చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయన చెప్పినట్లు వలస పక్షులన్నీ ఆడుతున్నాయి. పైకి కాషాయ జెండా కప్పుకొని మనసు నిండా టీడీపీ రంగుతో ఉన్న వారికే బాబు టికెట్లు వచ్చేలా చేశారు. ఇందులో స్థానికత అంశం చూడలేదు. వారు కోరుకున్న విధంగా అవకాశం కల్పించారు. సీనియర్ బీజేపీ నేతలను దూరం పెట్టించారు. ఇప్పుడు మరో సీటుకు ఎసరు పెట్టారు. దీనిని రాధాకృష్ణ పత్రిక గెలుపు కోసం వ్యూహమంటూ డబ్బా కొడుతోంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. ఏపీలో చంద్రబాబు ఇచ్చే అరకొర సీట్ల కోసం దేహీ అని చేతులు చాచాల్సిన స్థితికి తెచ్చేశారు పురందేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు. ఇదే ఐవైఆర్ బాధంతా. కాకపోతే చాలామందిలా దాచుకోకుండా ఏం జరుగుతుందో కుండబద్ధలు కొట్టేశారు.