కంగారు పడకండి. ఈ స్టేట్మెంట్ ఆయన ఇప్పుడు ఏం ఇవ్వలేదు. ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం ఏప్రిల్ తొమ్మిదిన పాయకరావుపేట సభలో ఇచ్చాడు. మరి జపాన్ లా చేసాడా?? అనే విషయాన్ని జపాన్ వాళ్ళు కూడా కనుక్కోలేరు.
రాష్ట్రాన్ని రాష్ట్రంలా కాకుండా, వేరే ఇంకేదైనాలా చేసే చంద్రబాబు గారి దూరదృష్టి ఇప్పటిది కాదు. ఎప్పట్నుంచో.. ఆయన ఎక్కడికో చూస్తాడు, కాని పాపం ఏదీ కూడా పూర్తవదు. కాలక్రమేణా ఆయన వయసు ముదిరింది. తోడుగా ఈ సరదా కూడా ముదిరింది. 2014 లో మళ్ళీ సీయం అయ్యాక, అప్పుడే పసిబిడ్డలా పుట్టిన ఆంధ్రప్రదేశ్ ఆయన చేతిలో పడింది. అంతే కొత్త రాష్ట్రాన్ని మళ్ళీ సింగపూరు, చైనా, జపాను, కొరియా, ఇండోనేషియా, అమెరికా, మలేషియా చేస్తాను అని గప్పాలు కొట్టుకుంటూ, చేతిలో ఉన్న పాంప్లేటు పత్రికల్లో రోజుకో ప్రకటనలు చేసేవరకూ ఆ సరదా, దురదలా మారింది.
“అమరావతి నగరం చుట్టూ చలిగాలులు పంపించి శీతలీకరణ చేసేస్తాం, రోడ్డు మీద ట్రాఫిక్‌కు ఉంటే… పక్కనే నిర్మించిన కృత్రిమ కాలువలో ఫెర్రీల మాదిరిగా ఉండే పడవలేసుకుని కావలసిన ప్రభుత్వ కార్యాలయానికి చిటికెలో చేరుకుంటాం…” అంటూ సొంత పత్రికల్లో ప్రింటేయించుకున్నంత ఈజీగా పనులు చేయించడం కుదరదని, అధికారం అయిపోవచ్చిన అయిదేళ్ళు కి ఆయనకి భోధ పడింది. ఫెర్రీలు కాదు కదా, కనీసం… అమరావతి వెళ్ళే దారిలో అడ్డు వచ్చే కాలువలపై కనీసం డబుల్ వెహికల్ వెళ్ళేంత వెడల్పు అడ్డు బ్రిడ్జిలు కూడా కట్టించలేకపోయారు.
ఆ దేశం తరహా, ఈ నగరం నమూనా, ఈ రాజ్యం డిజైన్లు అంటూ సెల్ఫ్ జాకీలేసుకుని, పేపర్లలో స్వకుచమర్ధనం, కాంట్రాక్టులన్నీ తమ వాళ్ళకే ఇచ్చుకుని స్వకుల మర్దనం చేసుకోవడం తప్ప… ఆయన అధికారంలో ఉండగా చేసిన పనులేమన్నా ఉన్నాయా అంటే… తాత్కాలికంగా కూడా నిలబడలేని తాత్కాలిక భవనాలను కట్టడమే. మరి ఇరవయ్యేళ్ళిస్తే రాష్టాన్ని జపాన్‌లా మార్చేస్తా అనే ఆయన, ఇరవయ్యేళ్ళ తర్వాత ఉండే జపాన్‌లా మారుస్తాడా?? లేక ఇరవయ్యేళ్ళనాటి జపాన్‌లా మారుస్తాడా అనేది చెప్పకపోవడం మాత్రం పెక్కు దురదృష్టకరం.
బహుశా ఈ తరహా మానసిక వైపరీత్యానికి మానసిక శాస్త్రంలో కూడా సరైన పేరు లేదనుకొంటా .