ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పులు చేర్పులపై కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలగా అభ్యర్ధులని ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్న అభ్యర్ధులని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం అలాగే సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా అభ్యర్ధుల నియోజకవర్గాలని మార్చడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది .
అయితే పార్టీకి విధేయతగా ఉన్న వారు అధిష్టానం చెప్పినట్టుగా నడుచుకోవడానికే మొగ్గుచూపుతుంటే కొంతమంది మాత్రం సొంత ప్రయోజనాల దృష్ట్యా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీని వీడి వెళ్ళగా ఇప్పుడు ఆ జాబితాలో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కూడా చేరిపోయారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఇద్దరూ పార్టీ సర్వేల్లో వెనకపడి సీట్లను కోల్పోతే లావు కృష్ణదేవరాయలు మాత్రం సర్వేల్లో మంచి మార్కులే సాధించినా సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా సీటు మార్చడంపై అలకపూని పార్టీని వీడినట్టు తెలుస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైఎస్సార్సీపీ అధిష్టానం శ్రీకృష్ణదేవరాయలును ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. దీనికి కారణం నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించాలని జగన్ భావించినట్టుగా తెలుస్తుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం అధిష్టానం నిర్ణయానికి నో చెప్పారు.. గుంటూరు నుంచి పోటీ చేయలేనని కుండబద్దలు కొట్టేశారు. తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పి అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
జగన్ గారి ప్రోత్సాహంతో పల్నాడు ప్రాంతంలో అభివృద్ది బాటలు వేస్తు మంచి పేరు తెచ్చుకున్న లావు శ్రీకృష్ణదేవరాయలు చివరికి స్వప్రయొజనాలకే పెద్దపీటవేసి పార్టీకి రాజీనామా చేయడం నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో చర్చనీయంశంగా మారింది. వైయస్సార్సీపీ తరుపున గెలిచిన ఎంపీల్లో జగన్ గారి అండతో వెనకపడిన పల్నాడు ప్రాంతాన్ని గతంలో ఎన్నడు చూడని విధంగా కేంద్ర సహకారంతో అనేక అభివృద్ది పనులు చేసిన లావు చివరికి స్వప్రయోజనాలు చూసుకోవడంతో క్యాడర్ నమ్మకాన్ని కోల్పోయారనే వాదన వినిపిస్తుంది.
నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని ప్రముఖ శైవక్షేతమైన కోటప్పకొండ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ పథకంలో చేర్చి, తగిన నిధులను కేటాయించాలని ఎంపీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి కోరగానే కేంద్రం పై ఒత్తిడి తేవడం దగ్గరనుండి, దశాబ్దాలుగా మూలనపడిన ఎగువ పల్నాడు ప్రాంతవాసుల చిరకాల స్వప్నం వరికపుడిసెల ప్రాజెక్టుకి అనుమతులు సాధించి పనులు ప్రారంభించడం. పల్నాడు పల్లెల్లో ప్రజలకు సులువుగా రాకపోకలు ఉండేదుకు 7 నియోజకవర్గాల్లో 86 గ్రామాల్లో 435 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ది చేపట్టడం. జగన్ గారి కృషితో నకరికల్లు మండలం గుండ్లపల్లిలో పల్నాడు ప్రాంత రైతులు అభివృద్ది బాటాలు వేసేందుకు ఇండో – ఇజ్రాయిల్ ప్రాజెక్టును సాధించడం. నరసరావుపేట నియోజక వర్గ పరిధిలో కాకాని గ్రామం వద్ద 86 ఎకరాల జేఎన్టీయూ కాలేజీ నిర్మాణం , పల్నాడు రైల్వే స్టేషన్లలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయడం. మెడికల్ కళాశాలలు, హైవేల నిర్మాణానికి నిధులు సాధించడం. మాచర్ల, రొంపిచర్ల కేంద్రియ విద్యాలయాలు సాధించడం, ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం జగన్ గారు పల్నాడు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయడానికి సహకరించటంతో పాటు ఎంపీగా ఉన్న లావు కృష్ణ దేవరాయలని ప్రోత్సహించడంతో అనేక అభివృద్ది కార్యక్రమాలు పల్నాడు ప్రాంతానికి దక్కాయని. ఇప్పుడు సీటు మార్చారు అనే ఒకే ఒక్క కారణంతో స్వప్రయోజనం కోసం పార్టీని వీడి వెళ్ళడం, జగన్ సహకారంతో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన కృషి అని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని పల్నాడు ప్రాంత వాసుల అభిప్రాయంగా వినిపిస్తుంది .