ఎన్డీఏలో చేరడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలామంది కాళ్లే పట్టుకున్నాడు. తీరా పొత్తు ఖరారయ్యాక ఏపీలో బీజేపీని తొక్కడం ప్రారంభించాడు. ఆ పార్టీ నేతల మధ్యే తగాదాలు పెట్టి ఒకరికొకరికి పడకుండా చేసేశాడు. ఇతర పార్టీల నుంచి వెళ్లి కాషాయ జెండా కప్పుకొన్న వారు నేడు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో వాళ్లంతా చంద్రబాబుకు భజన చేస్తుండడం గమనార్హం.
ఏపీ బీజేపీ చీఫ్ పదవిపై సుజనా చౌదరి కన్ను పడింది. ఎన్నికలకు ముందే అధ్యక్షుడి కుర్చీ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ఇప్పుడు కాదని సర్ది చెబుతూ వచ్చారు. ఎన్నికల తర్వాత తీసుకోవాలని సుజనా డిసైడ్ అయిపోయాడని ప్రచారం జరుగుతోంది. అందుకే తను వేస్తున్న పోస్టర్లలో పురందేశ్వరిని సైడ్ చేసేశారు.
పురందేశ్వరి ప్రస్తుతం చంద్రబాబుకు లాయల్గానే ఉన్నారు. ఆయన ఏం చెబితే బీజేపీలో అది జరిగేలా చూస్తున్నారు. టికెట్లు చెప్పిన వారికే ఇచ్చారు. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతున్నారు. కానీ హస్తిన పెద్దల్ని ప్రచారానికి తీసుకురావడంలో పురందేశ్వరి విఫలమయ్యారని బాబుకు కోపం ఉంది. ఆమె మాత్రం నా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు సర్ది చెప్పుకొంటోంది.
ప్రస్తుతం సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన బాబుకు అత్యంత సన్నిహితుడు. విజయవాడ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తే చివరికి అసెంబ్లీ సీటు దక్కింది. దీంతో ఇక్కడ బలంగా ఉండాంటే ఏపీ బీజేపీ చీఫ్ పదవి తీసుకోవాల్సిందేనని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు వద్ద ఇదే విషయం ప్రస్తావించగా ఎన్నికలయ్యాక చూద్దామని చెప్పారట. ఈ నేపథ్యంలో సుజనా పురందేశ్వరిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. తన మనుషుల ద్వారా అధిష్టానానికి ఆమెపై ఫిర్యాదులు చేయిస్తున్నారు.
ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం సుజనా చౌదరి పెడుతున్న పోస్టులు బీజేపీలో చర్చకు దారి తీశాయి. కొన్నింట్లో మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. పురందేశ్వరి ఫొటోను తీసేశారు. సాధారణంగా అభ్యర్థుల తమ పార్టీ అధ్యక్షుల ఫొటోను పోస్టుల్లో తప్పనిసరిగా ఉంచుతారు. కానీ సుజనా మాత్రం నేనే కాబోయే బీజేపీ చీఫ్ని.. ఇక ఆమెతో పనిలేదనే ధోరణలో ఉన్నారు. చంద్రబాబు కూడా పురందేశ్వరిపై అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో త్వరలో ఏపీలో కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడు రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. పాపం చిన్నమ్మ.. రోజూ గొంతు చించుకుని మరిది కోసం అరుస్తుంటే ఆయన మాత్రం వెన్నుపోటు రుచి చూపించేందుకు సిద్ధమయ్యాడు.