కందుకూరు నియోజకవర్గంలో కూటమి నుండి టీడీపీ పోటీలో ఉన్నది. ఇక్కడ టీడీపీ తరుపున ఇంటూరి నాగేశ్వరరావు పోటీలో నిలబడ్డారు. కాగా టీడీపీ అభ్యర్థి ఎంపిక గురించి దగ్గరనుండి అడుగులు తడబడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం పోతుల రామారావు, ఇంటూరి రాజేష్,ఇంటూరి నాగేశ్వరరావు మధ్య తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. అయితే టీడీపీ జెండా మొదటి నుండి మోసిన దివిస్ శివరామ్ ను కాదాని వేరే వారికి టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో నిప్పు రాజుకుంది. దాని తరువాత అన్నదమ్ములు ఇంటూరి రాజేష్,ఇంటూరి నాగేశ్వరరావు మధ్య టికెట్ పోరుతో కార్యకర్తలు అల్లాడిపోయారు. ఇంటూరి రాజేష్ కార్యక్రమాలకు దివిస్ శివరామ్ అండ దండలు అందించారు, ఇక పోతుల రామారావు కందుకూరులో 2019 ఓటమి తరువాత ఇక్కడ పట్టించుకోవడంలేదు ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.
ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించిన తరువాత అతని సోదరుడు అయిన ఇంటూరి రాజేష్ రగిలిపోతున్నారు. నాగేశ్వరరావును ఎలా అయిన ఓడిస్తా అంటూ విడిగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు దీనికి పార్టీ సీనియర్ దివిస్ శివరామ్ అండగా ఉండటం మొదలు పెట్టారు. పరిస్థితులు చూస్తుంటే రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభలో స్టేజి మీదకు పిలిచిన వెళ్లకుండా కిందనే కూర్చొని తమ నిరసన గళం విప్పారు.
చూస్తుంటే కందుకూరు టీడీపీ మూడు ముక్కలుగా విడిపోయింది. టికెట్ సాధించిన ఇంటూరి నాగేశ్వరరావు ఒకవైపు ఇంటూరి రాజేష్ , దీవిస్ శివరామ్ ఒక వర్గంగా, పోతుల రామారావు మరో వర్గంగా చీలిపోయి ఎవరికి వారే అన్నట్టు కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు అయోమయంలో పడి ఎవరికి సపోర్ట్ చెయ్యాలో ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరికి కోపం వస్తుందో అని మదనపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ అభ్యర్థిని మారుస్తారు అంటూ ప్రచారం జోరుగా సాగుతూనే వుంది. దీనితో టికెట్ సంపాదించిన ఇంటూరి నాగేశ్వరరావు తన పరిస్థితి ఏమిటో అర్ధం కాని పరిస్థితుల్లో నిలబడ్డారు. పార్టీ పెద్దలు అసలు వీటి గురించి పట్టించుకునే స్థితిలో లేకపోవడం, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు గొడవల గురించి పట్టించుకోకపోవడంతో ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో వున్నారు. చూస్తుంటే మూడు గ్రూప్ లుగా విడిపోయిన టీడీపీ ఒకరికి ఒకరు పోటి పడి ఓడించుకుంటారో లేక కలిసి పోటి చేసి నిలుస్తారో చూడాలి.