తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి అధికార కాంక్ష ఎక్కువ. అందుకే పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కొన్నారు. అప్పటి నుంచి దానిని వదిలేందుకు ఇష్టపడటం లేదు. అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. పదవిలో ఉండేందుకు ఆయన ఎన్నో ఆరాచకాలు చేశారు. 2004, 09లో వైఎస్ రాజశేఖరరెడ్డి బాబుకు చెక్ పెట్టారు. 14లో బాబు బీజేపీ పుణ్యాన గెలిచారు. ఈసారి అమరావతి పేరుతో డబ్బు మూటలు బాగా వెనుకేసుకున్నారు. 2019లో జగన్ టీడీపీని చిత్తుగా ఓడించారు. ఓడిపోయిన నాటి నుంచి నారా వారిలో అసహనం పెరిగిపోయింది. అందుకే పదవి పోగానే తన సామాజికవర్గాన్ని రెచ్చగొట్టాడు. వాళ్లేమో మీ స్థానంలో మరొకరు సీఎంగా ఉంటే చూడలేమని సోషల్ మీడియాలో అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
19 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రతి సభలో తన వయసును మర్చిపోయి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. తెలుగు తమ్ముళ్లే అసహ్యించుకునే స్థాయికి ఆయన భాష చేరింది. ఒకానొక సందర్భంలో ఓట్లు వేయని జనాన్ని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఇక అధికారులను చులకనగా మాట్లాడటం బాబుకు అలవాటైపోయింది. పోలీసుల విషయంలో ఇది మరీ ఎక్కువైంది. వారిని చాలా నీచంగా చూస్తున్నాడు.
కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల సభలను పరిశీలిస్తే అసలు హుందాతనమే కనిపించదు. ప్రతి మాటలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రా కదలి రా సభ జరిగింది. ఇందులో బాబు ఉపయోగించిన భాషపై ప్రజాస్వామ్యవాదులు అభ్యంతరం వ్యకం చేస్తున్నారు. నేను అధికారంలో వస్తే ప్రజలకు మంచి చేస్తానని చెప్పకుండా ప్రత్యర్థి పార్టీని అంతమొందిస్తానని ప్రకటించారు. ‘నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరినైనా తొక్కుకుంటూ పోతా. పోలీసులూ మీరంతా జాగ్రత్తగా ఉండాలి.’ అంటూ బాబు సినిమా డైలాగులు చెప్పారు. ఈ సభకు ఎవరూ అడ్డంకులు సృష్టించలేదు. జనం రాలేదు. దీంతో ఖాళీ కుర్చీలను చూసి టీడీపీ అధినేత అసంతృప్తితో రగిలిపోయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే ఎవరూ రాలేదని ఆరోపించారు. వారిని తొక్కుకుంటూ పోతానని బెదిరించారు. జగన్ను అయితే ‘నువ్వు నా ముందు పిల్ల బచ్చా. మీ నాన్నే నాకు భయపడ్డాడు. నిన్ను మీ పార్టీని భూస్థాపితం చేస్తా’ అని విచక్షణ కోల్పోయి మాట్లాడారు.
దాదాపు ప్రతి సభలో చంద్రబాబు ఇలాంటి భాషే వాడుతున్నారు. ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అంతే. నోటికి ఏదొస్తే అది మాట్లాడేది వీళ్లయితే ఎల్లో మీడియా మాత్రం వైఎస్సార్సీపీ నేతల భాష బాగోలేదంటూ ప్రచారం చేస్తుంది. అధికారం లేదనే అసహనం తండ్రీకొడుకుల్లో బాగా కనిపిస్తోంది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో మరింత దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజల్ని తిడితే ఓట్లు పడవు. వారికి భరోసా కల్పించాలి. ఇతర పార్టీలను ఎలా పడితే అలా మాట్లాడితే పరువు పోతుంది తప్ప వారికేమి కాదు. ఈ విషయాలు విజనరీకి ఎప్పుడు తెలుస్తాయో..