ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. విశాఖపట్నంలో గతంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో రూ.52,015 కోట్లకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇందులో సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో కూడిన పది గిగావాట్ల కెపాసిటీ గల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 12 వేల మందికి పైగా ఉపాధి అవకాశం దక్కనుంది.
ఎక్కడెలా..
ఏపీ జెన్కో పోలవరం వద్ద 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ నిబంధనలతో విశాఖలో ఇంధన సామర్థ్య భవనాన్ని నిర్మిస్తారు. 3.52 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధన పొదుపు కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్‌తో కలిసి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.3 వేల కోట్ల విలువైన కడప సోలార్ పార్క్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో 1,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పార్క్‌లో 200 మందికి, విజయవాడలో ఈ–స్కూటర్ తయారీ ప్లాంట్‌లో వందలాది మందికి ఉపాధి కల్పించనున్నారు.