జగన్ ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదల సొంతింటి కలను నిజం చేస్తూనే వారికివ్వబోయే స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించి ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇప్పటికే 31.19 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు అందించిన ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలను అందిస్తున్నాయి. కానీ ఆ స్థలాలపై పేదలకు హక్కులు ఉండేవి కావు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల అనంతరం ఆ స్థలాలపై లబ్దిదారులకు సర్వహక్కులు ఉండేలా జగన్ సర్కారు చట్టాన్ని సవరించింది. ఆ చట్ట ప్రకారంమే పట్టాలు అందించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించి వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తుంది. పదేళ్ల అనంతరం ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. దాంతో ఆ పట్టాల యజమానులు వాటిపై సర్వహక్కులు పొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటాబేస్లో రిజిస్ట్రేషన్ల డేటా ఉన్నందున లబ్ధిదారుల ఇళ్ల పట్టాకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని ఎప్పుడైనా పొందవచ్చు.
నేడు సీఎం జగన్ ఒంగోలు నగర పరిధిలోని ఎన్.అగ్రహారం వద్ద 20,840 మంది లబ్దిదారులకు కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. ఒంగోలు వాసుల దాహార్తిని తీర్చేలా రూ.339 కోట్ల నిధులతో చేపట్టనున్న తాగునీటి పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా సీఎం జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.