ఏపీలో ఎన్నికల నామినేషన్లు దాఖలు చివరికి వచ్చింది. వైసీపీ పార్టీ తరపున తన అభ్యర్థులను నెల క్రితమే ప్రకటించి సంచలనం సృష్టించారు. కూటమి తరుపున అసలు ఏ సీటులో ఏ పార్టీ పోటీనో ఈరోజు వరకు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అనపర్తి లాంటి చోట్ల అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చెయ్యాలో అనికూడా తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కూటమిలో టికెట్ల గొడవలతో హిందూపూర్ పార్లమెంటు కింద వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలజడి మొదలైంది. ప్రతీ చోటా అంతర్గతంగా గొడవలు పడుతూ నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు బద్దలు అవుతోందో తెలీని పరిస్థితి కూటమిలో హిందూపురం పార్లమెంట్ వ్యాప్తంగా వుంది.
మడకశిరలో ఇప్పటికే సునీల్ కు టికెట్ అని చెప్పి చివరి నిమిషంలో రాజుకు టికెట్ ఇవ్వడంతో ఈరన్న వర్గం టీడీపీ మీద దుమ్మెత్తిపోసి చంద్రబాబు ఫోటోలను చెప్పులతో కొట్టి టీడీపీని ఓడించి తీరుతామని ప్రకటించారు. హిందూపురంలో పరిపూర్ణనంద స్వామి రూపంలో రెబల్ నాయకుడు వుండి టీడీపీని ఓడిస్తాం అంటూ శపధం పూనారు . వారితో పాటు లోకల్ టీడీపీ నాయకులు నియోజకవర్గానికి సంబంధం లేని నందమూరి బాలకృష్ణకు ప్రతిసారి ఎలా అవకాశం ఇస్తారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పెనుగొండలో టీడీపీ అభ్యర్థి సవితాకు లోకల్ లీడర్ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సహాయ నిరాకరణ చేస్తున్నారు. కీలక నియోజకవర్గం అయిన పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబం పోటీచేస్తున్నా కానీ ఇక్కడ బీసీ నాయకులు సపోర్ట్ చెయ్యడం లేదు, మా బీసీలకు టికెట్ ఇస్తాము అని చెప్పి మోసం చేసి చివరకు మళ్ళీ పల్లె కుటుంబానికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ బీసీ వర్గాలు ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీకి రాజీనామాలు చేసి దూరం జరిగారు.
అత్యంత వివాదాస్పద నియోజకవర్గమయిన ధర్మవరంలో వరదాపురం సూరికి టికెట్ దక్కకపోవడంతో బిజెపి అభ్యర్థిని ఓడించి తీరుతాం అని అతని మద్దతుదారులు చెప్పటంతో పాటు ఎక్కడ ప్రచారంలో సహకరించటంలేదు . మరో కీలక నియోజకవర్గం రాప్తాడులో సునీతకు ఎక్కడా టీడీపీ నాయకుల నుండి సహకారం లభించడం లేదు దానితో పాటు వరదాపురం సూరి తనకు టికెట్ దక్కపోవడానికి కారణం పరిటాల సునీత అని తనని ఓడించి తీరుతా అని శపథం చేశారు. కదిరిలో టీడీపీకి ఇప్పటికే పార్టీ తరపున పోటీకి అవకాశం కల్పిస్తాం అని ముస్లింలను మోసం చేశారని నియోజకవర్గ కీలక నేత అయిన ఆంజాద్ బాషా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. అలాగే మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప కూడా టీడీపీ అభ్యర్థికి సహకరించడం లేదు.
ఇలా దాదాపు హిందూపురం పార్లమెంటు కింద ఏ నియోజకవర్గం చూసుకున్నా టీడీపీ రెబల్స్ తో , అసంతృప్తి నేతలతో సతమతం అవుతుందనే చెప్పొచ్చు.