‘అధికారంలో సగ భాగం జనసేనకు దక్కాలి. గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ పదవి దక్కించుకోవాలి’. తాజాగా లేఖలో మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య చేసిన సూచన ఇది. తన మాటలను పట్టించుకోకుండా సేన 24 సీట్లకే పరిమితం కావడం, కాపు సామాజికవర్గానికి అన్యాయం చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం లేఖ వదిలారు. కూటమిలో పవన్ హోదా ఏంటో చెప్పాలని.. లేకపోతే 29వ తేదీన తన నిర్ణయం ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు.
లేఖలోని ప్రధాన అంశాలు
టీడీపీ – జనసేన పొత్తు.. సీట్ల పంపకం.. చూశాక బడుగులకు రాజ్యాధికారం పక్కదారి పడుతున్నట్లు అనిపిస్తోందని జోగయ్య అనుమానం వ్యక్తం చేశారు. అసలు వారి భవిష్యత్ ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానం ఏంటి, ఎక్కడ అనే మీమాంస బడుగు బలహీనవర్గాల్లో ఉంది. వారు కోరుకుంటున్న రాజ్యాధికారం పక్కదారి పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో సమాధానం కోసం ఎన్నికలయ్యేంత వరకు ఆగడానికి వీల్లేదు. అధికారం పంచుకోవడంలో పవన్ పాత్ర ఏంటో, చంద్రబాబు పాత్ర ఏంటో తెలియకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్‌కి దక్కాలి. ఈ విషయాలపై తాడేపల్లిగూడెంలో జరిగే సభలో తెలుగుదేశం అధినేత ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. జనసైనికులకు సంతృప్తికరమైన సమాధానం దక్కాలి. వారి ఆనందం నేను చూడాలి. లేకపోతే నేనేం చేస్తానో 29న ప్రకటిస్తాను.
జోగయ్య లేఖలు రాస్తున్నా పవన్ కళ్యాణ పట్టించుకోవడం లేదు. సీఎం పదవి షేరింగ్ అడగాలని చెబుతున్నా లెక్క చేయకుండా తక్కువ సంఖ్యలో సీట్లు తీసుకున్నాడు. ఇది కాపులకు అవమానంగా ఈ మాజీ ఎంపీ భావిస్తున్నారు. అయినా సేనాని సొంత సామాజనికవర్గానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. హరిరామ అడుగుతున్నట్లు పవన్ పాత్రపై చంద్రబాబు తాడేపల్లిగూడెం సభలో స్పష్టత ఇస్తారో.. నాకేం సంబంధం లేదన్నట్లుగా ముఖం చాటేస్తారో..