విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, వర్చువల్ బోధన, టోఫెల్లో శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ తదితర వాటిని ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటితోపాటు అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద తదితర పథకాలను పేద విద్యార్థుల కోసం తెచ్చింది. ఐబీ సిలబస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో విద్యా రంగంలో వివిధ పథకాలపై చేసిన ఖర్చు రూ.71,017 కోట్లు. కార్పొరేట్ స్కూళ్లలో యాజమాన్యాలు పిల్లల వద్ద నగదు వసూలు చేసి కొత్త విధానాలు తీస్తుంటాయి. కానీ జగన్ హయాంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా స్విఫ్ట్ చాట్ యాప్ ను తెచ్చారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను (ఐఎఫ్‌పీ) పాఠశాలల్లో ఏర్పాటు చేసి, ఆధునిక విద్యాబోధనను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉండేందుకు మరో అడుగు ముందుకేసింది. టీచర్లు తమ స్మార్ ఫోన్ ద్వారా ఎటువంటి ప్రశ్నకైనా సమాధానాన్ని సులువుగా చెప్పేందుకు స్విఫ్ట్ చాట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంపై పనిచేసే విధంగా దీనిని రూపొందించారు.
ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు, భాషలకు సంబంధించిన పాఠ్యాంశాలను మొబైల్ యాప్‌లో పొందుపర్చారు. స్మార్ట్ ఫోన్లో స్విఫ్ట్ చాట్ యాప్‌ను కలిగి ఉన్న ఉపాధ్యాయులు తరగతిలో పాఠ్యాంశాలను బోధిస్తున్న సమయంలో విద్యార్థులు లేవనెత్తే సందేహాలను దానిలో సెర్చ్ చేసి తక్షణమే సమాధానాన్ని చెప్పే వీలు కల్పించారు. అదేవిధంగా 6వ తరగతిలో సైన్స్ బోధిస్తున్న సమయంలో విద్యార్థి అడిగే సందేహానికి సమాచారంతోపాటు వీడియోల ద్వారా ప్రత్యక్షంగా చూపి, వివరించవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐఎఫ్పీలతోపాటు 8, 9 తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌లలో ఉన్న స్విఫ్ట్ చాట్ ద్వారా ఉపాధ్యాయులు విద్యాబోధన చేసే వీలుంది. వీటితోపాటు అదనంగా మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. యాప్‌ను ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తొలిదశలో అమల్లోకి తెచ్చారు. విద్యాశాఖ పంపే లింక్‌ల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆధునిక విద్యాబోధనలో అంతర్భాగంగా ఈ యాప్‌ను ప్రభుత్వం తెచ్చింది. ఇది ఉపాధ్యాయులకు ఎంతో సహాయకారిగా ఉండనుంది.