ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ డీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరనుండి చూసిన ముఖ్యమంత్రి జగన్ ఏవైతే హామీలను ఇచ్చారో వాటిని అన్నింటిని తూచా తప్పకుండా అమలుచేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ అభివృద్ధి బాట పట్టగా అంతకు మించిన రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం ఏపీలో వైఎస్సార్ తనయుడైన జగన్ హయాంలో జరిగందని బొత్స తెలిపారు. సంక్రాంతి పండగ అనంతరం డీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
కాగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మూడు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను అందించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దాంతో డీఈఓలు, ఆర్జేడీలు వివిధ మేనేజ్మెంట్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి సంక్రాతి అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయనుంది.