వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరించారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. తమను క్రమబద్ధీకరించడం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మాట ఇచ్చిన ప్రకారమే తమకు న్యాయం చేసారంటూ కాంట్రాక్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.