రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికలు గుర్తు కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. గెలుపు తీరాలకు చేర్చేది ఎన్నికలు గుర్తే కాబట్టే ఆ గుర్తు విషయంలో అభ్యర్థులు ఆచి తూచి అడుగులు వేస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా అర్థం పట్టేలా ఉండే గుర్తులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమిగా పోటీ చేస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేటాయించిన గుర్తు విషయంలో గందరగోళం నెలకొంది.
నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం అనంతరం రిటర్నింగ్ అధికారులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. అయితే జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తులు కేటాయించారు రిటర్నింగ్ అధికారులు. ఈ నేపథ్యంలో కూటమి కొన్ని అభ్యంతరాలను తెలుపుతూ ఈసీకి లేఖ రాసింది. లేక రాయడమే కాకుండా హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. జనసేన బిజెపి ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుండి కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి మాత్రమే గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని కోర్టులో టిడిపి పిటిషన్ వేసింది.
అయితే గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేన అభ్యర్థులకు మాత్రమే కేటాయించాలని హైకోర్టు లో టిడిపి వేసిన పిటీషన్ పై అనేక విచారణల అనంతరం ఈసీ చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలను కోర్టుకు వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను మార్చలేము అని తేల్చి చెప్పింది. అసలు టిడిపి వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని తెలిపింది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు అభ్యంతరాలు వస్తూనే ఉంటాయని, పిటిషన్ల మీద పిటిషన్లు పడుతూనే ఉంటాయని ఈసీ కోర్టుకు వివరించింది. అయితే జనసేన అభ్యంతరాలపై నిన్ననే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా ఒక పక్క ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు అందజేత కూడా జరిగిపోతుండడంతో ఈ విషయంపై ఏమీ చేయలేమని ఈసీ తెలిపింది. ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేము అని ఎన్నికల సంఘం (ఈ సీ ) కోర్టుకు స్పష్టం చేసింది.