ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణలోని మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని విజయవంతంగా అమలు చేసి చూపిస్తోంది. తెలంగాణలో అయితే అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సర్కారు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఉచిత బస్సు ప్రయాణం:
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి వారంరోజుల్లో ఎలాంటి గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఆ తర్వాత మహిళలు తమ ఆధార్ కార్డుని చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక పథకాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
దాదాపుగా కర్ణాటక మేనిఫెస్టో తరహాలోనే తెలంగాణలో కూడా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది. అలాగే అధికారాన్ని కూడా చేపట్టింది. వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ వారికి ఓట్లను కురిపించింది. ఇప్పుడు ఇలాంటి ఒక పథకం ఏపీలో కూడా అమలు అయ్యే ఆస్కారం మెండుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ హామీ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటకలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ఇలాంటి ఒక హామీ జోలికి వెళ్లలేదు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి రాలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అనే హామీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉచిత ప్రయాణం హామీని మేనిఫెస్టోలో పెడితే ప్రభుత్వం అమలు చేయగలదా? లేదా? అనే అంశాలపై కసరత్తు కూడా జరుగుతోందని చెబుతున్నారు.
ఏపీలో అధికారం కోసం అన్నీ రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మహిళల ఓట్లను గంపగుత్తగా అందించే ఇలాంటి ఒక ఉచిత ప్రయాణం హామీ అనేది రాజకీయ పార్టీలకు బోనస్ లాంటిదే అవుతుంది. అందుకే మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ఆస్కారం ఉందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుంది? ఏదైనా రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాయా? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని నెలలు ఆగాల్సిందే. మరి.. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.