వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని మరోసారి రుజువైంది. మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిని ఆంధ్రపదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్గా నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఉండగా ఈయన వచ్చే అసెంబీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా జంకె రెండు సంవత్సరాలపాటు చైర్మన్గా కొనసాగుతారని సోమవారం ఇచ్చిన జీవో నంబర్ 26లో ప్రభుత్వం పేర్కొంది. జంకె సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా పేరుంది. మార్కాపురం నుంచి 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, 2014 సంవత్సరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వెంకటరెడ్డికి అవకాశం దక్కలేదు. కేపీ నాగార్జునరెడ్డికి ఇచ్చారు.
అయినా వెంకటరెడ్డి పార్టీని విడలేదు. అంకితభావంతో ఉన్నారు. వైఎస్సార్సీపీ పటిష్టతకు కృషి చేయడంతో జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. ఇదిలా ఉండగా 2024 ఎన్నికల్లో మార్కాపురం టికెట్ ఆశించారు. అయితే వివిధ కారణాలతో ఇక్కడ ఇన్చార్జిగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును నియమించారు. అయితే జంకెకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించలేదు. ఆయనకు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని అందించింది. దీంతో జంకె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయతకు జగన్ పట్టం కట్టారని కొనియాడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారికి ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తానని అధినేత హామీ ఇస్తున్నారు. అయితే కొందరు అత్యుత్సాహంతో పార్టీని వీడుతున్నారు. జంకె వెంకటరెడ్డిలా నాయకుడినే నమ్ముకుంటే ఏనాటికైనా పదవులు వరిస్తాయి.